ఇరుదేశాల మధ్య దృఢమైన బందం.. యూఎస్ కాన్సుల్ జనరల్
భారత్-అమెరికాది దృఢమైన బంధమని, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత స్థితిలో కొనసాగుతున్నాయని యూఎస్ యాక్టింగ్ కాన్సుల్ జనరల్ ఎరిక్ అలెగ్జాండర్ చెప్పారు. రక్షణరంగంలో ఈ బంధం బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఉమ్మడి భాగస్వామ్య పరిశోధన, అత్యాధునిక రక్షణ పరికరాల ఉత్పత్తి, ఇండో-పసిఫిక్ ప్రాంతం లో వ్యూహాత్మక సహకారం ఇప్పటికే అభివృద్ధి చెందిందన్నారు. యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, నెక్సస్ స్టార్టప్ హబ్ సంయుక్తంగా టీ-హబ్లో రెండ్రోజులపాటు నిర్వహించే డిఫెన్స్ సార్టప్స్ వర్క్షాప్ను ఎరిక్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ టెక్నాలజీతో సహా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదన్నారు. రక్షణరంగంలో నూతన ఆవిష్కరణలకు అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకొనేందుకు యువ ఔత్సాహికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నెక్సస్ స్టార్టప్ హబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ అజులే మాట్లాడుతూ దేశంలో స్టార్టప్ ఎకోసిస్టంను ప్రోత్సహించేందుకు యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రపంచంలోనే తొలి నెక్సస్ ఇన్నోవేషన్ హబ్ అండ్ ఇంక్యుబేటర్ని ఢిల్లీలో ఏర్పాటు చేసిందన్నారు. కాగా, 20 ఇన్నోవేటివ్ స్టార్టప్ వ్యవస్థాపకులు, సీఈవోలకు రక్షణరంగంలో ఉన్న అవకాశాల గురించి తొలి రోజు నిపుణులు వివరించారు.













