హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం
హైదరాబాద్‌లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తెలిపింది. మొత్తం 1800 మంది ఉద్యోగులు ఈ కేంద్రంలో పని చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన శాండోస్ కంపెనీ సీఈవో రిచర్డ్ సెయ్ నోర్ ప్రతినిధి బృందం ఈ మేరకు వెల్లడిరచింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్న కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ ఫార్మాసిటీలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పిన కేటీఆర్, ఈ రంగంలో అభివృద్ధి సాధించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. శాండోస్ కంపెనీ ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో ఉన్న తన అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపింది. తమ సంస్థ రానున్న రోజుల్లో ఆటోమేషన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ప్రపంచ స్థాయి లేబరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నగరంలో ఉన్న లైఫ్ సైన్సెస్ అనుకూల అంశాలే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ విస్తరణ, తమ భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుందన్న ఆశాభావాన్ని కంపెనీ ప్రతినిధి బృందం వ్యక్తం చేసింది. కంపెనీ కార్యకలాపాలకు భవిష్యత్తు ప్రణాళికలకు తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బృందం సభ్యులు మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.













