1.82 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్
ప్రజాసంక్షేమానికి పెద్ద పీటవేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2020-21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రూ.1,82,914 కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక•శా• మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) బడ్జెట్ 1,46,492.30 కోట్లు కాగా రానున్న ఏడాదికి ప్రతిపాదించిన బడ్జెట్ రూ.36,422 కోట్లు అధికం కావడం విశేషం. సొంత రాబడులు భారీగా పెరుగుతాయని అంచనావేసిన సర్కార్.. ఆ మేరకు బడ్జెట్ పరిమాణాన్ని పెంచింది. మొత్తం పద్దులో ప్రగతిపద్దు రూ.1,04,612 కోట్లుగా, నిర్వహణ వ్యయం రూ.78,301.80 కోట్లుగా పేర్కొన్నది. నిర్వహణ ఖర్చులకంటే అభివృద్ధి, సంక్షేమానికి కేటాయింపులు రూ.26,310 వేల కోట్లు అధికంగా ఉండటం గమనార్హం.
వచ్చే ఏడాది రాబడులు రూ.1,82,701.94 కోట్లుకు పెరుగుతాయని అంచనావేయగా రెవెన్యూ మిగులును రూ.4,482.12 కోట్లుగా, ద్రవ్యలోటును రూ.33,191.25గా చూపింది. ద్రవ్యలోటును ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి మొత్తం జీఎస్డీపీలో 3 శాతం మేరకే ఉన్నదని ప్రకటించింది. ఈసారి రాష్ట్ర సంపద ప్రస్తుత ధరల వద్ద రూ.8,61,031 కోట్ల నుంచి రూ.9,69,604 కోట్లుకు పెరుగుతుందని ప్రణాళికా విభాగం లెక్కల్లో తేలింది.













