మంత్రి పువ్వాడ అజయ్ కు హైకోర్టు నోటీసులు
తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కు కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు నోటీసు జారీ చేసింది. మమత మెడికల్ కాలేజీ చైర్మన్ హోదాలో ఆయనకు కోర్టు నోటీసు ఇచ్చింది. పీజీ వైద్య కోర్సులకు 2016 జీవో ప్రకారం పాత ఫీజు తీసుకోవాలని వైద్య కళాశాలలకు గతేడాది హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, మమత మెడికల్ కాలేజీ పీజీ వైద్య కోర్సులకు 2017 జీవో ప్రకారం పెంచిన ఫీజులు వసూలు చేసింది. దీంతో కాలేజీలు వసూలు చేసిన అధిక ఫీజు విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మమత మెడికల్ కాలేజీ తమకు రావాల్సిన ఫీజు తిరిగి ఇవ్వడం లేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలని పువ్వాడ అజయ్‌కి నోటీసులు ఇచ్చిన ధర్మాసనం, తదుపరి విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.













