బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి.. న్యూట్రీషన్ కిట్
బతుకమ్మ కానుకగా వచ్చే నెల నుంచి గర్భిణులకు సీఎం కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కోఠిలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయ ప్రాంగణంలో ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ అమలు కోసం ఈ యూనిట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13.30 లక్షల మందికి కేసీఆర్ కిట్లు అందించినట్లు వెల్లడిరచారు. రాస్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 5 క్యాత్ ల్యాబ్స్, ఎమ్ఆర్ఐ, 30 సీటీస్కాన్‌లతో పాటు 1,020 అధునాతన పరికరాలు ఉన్నాయని వెల్లడించారు.
ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చేందుకు ఔషధాల బడ్జెట్ కూడా పెంచుతున్నామని స్పష్టం చేశారు. ఔషధాల పోర్టల్‌ను ఉపయోగించి 3 నెలలకు అవసరమైన మందుల స్టాక్ ప్రభుత్వం ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశిస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలల సూపరింటెండెంట్లు వద్ద రూ.100 కోట్ల నిధులు పెడుతున్నామని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో యంత్రాలు పాడైతే వెంటనే మరమ్మతులు చేసేందుకు వీలుగా ఈ ఉపకరణ్ అనే వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.













