సికింద్రాబాద్ లో టీఆర్ఎస్ చేయిస్తే.. మరి యూపీలో
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశమంతా అట్టుడుకుతోందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం మోతెలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశం కోసం సేవ చేసే ఆర్మీ జవాన్లపై కూడా బీజేపీ రాజకీయాలు చేయడం దారుణమన్నారు. అగ్నిపథ్ విధానం యువతకు అర్థం కాలేదని కేంద్రం అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని ఆక్షేపించారు. సైన్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. సికింద్రాబాద్ అల్లర్లను టీఆర్ఎస్ చేయించిందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారన్నారు. సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ చేయిస్తే.. మరి యూపీలో పోలీస్ స్టేషన్ పైనే దాడి జరిగిందన్నారు. అలా అయితే యూపీలో యోగి, బిహార్ నితీష్ అల్లర్లు చేయించారా? అని ప్రశ్నించారు. ఆర్మీ ఉద్యోగాలను సైతం యువతకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.













