ఫైటర్ పైలట్ గా గురుకుల విద్యార్థి ఎంపిక

భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ కోర్సుకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఎస్) విద్యార్థి అశోక్ సాయి ఎంపికయ్యారు. కరీంనగర్ జిల్లాలోని రుక్మాపూర్ సైనిక గురుకుల పాఠశాలలో అశోక్ సాయి చదివాడు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండం పాల్వాయి అతని స్వగ్రామం. అశోక్ తండ్రి వికాలాంగుడు, కష్టషడితేనే పూట గడిచే పరిస్థితి ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపిక కావడం పట్ల అశోక్ సాయి, అతని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ నాలాంటి పేద విద్యార్థుల కోసం సైనిక పాఠశాలలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, శిక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటా. దేశానికి సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. అదే నా కల. జీవితాశయం. ప్రభుత్వ చేయూతో అది నెరవేరిందన్నారు. దీనిపై ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందిస్తూ.. పేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఫైటర్ పైలట్ కోర్సుకు ఎంపిక కావడం పట్ల తెలంగాణ రాష్ట్రం గర్వపడుతుందని కొనియాడారు.