హైదరాబాద్ లో టిడిఎఫ్(యుఎస్ఎ) ప్రవాసీ దివస్ విజయవంతం
తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు ఎంతో కీలక పాత్ర పోషించి, స్వరాష్ట్ర అవసరాన్ని ప్రచారం చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అందరూ కలిసి పోరాడినట్లుగానే పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి ఐక్యంగా పాటుపడాలని కోరారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ప్రవాసీ తెలంగాణ దివస్ 6వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. మంచి పనులను అభినందించిన విధంగానే అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సిన బాధ్యత కూడా ఫోరంపై ఉందన్నారు.
తెలంగాణ సాధనలో ప్రాణాలర్పించిన వారిలో యువకులే ఎక్కువని, వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అభివద్ధిలో ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ముందంజలో ఉందని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నారైలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టెందుకు ముందుకు రవాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. కాగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూ ఎస్ఏ తరపున నగరంలోని శిశు విద్యామందర్ అభివృద్ధి కోసం రూ.3.75 లక్షల విరాళం అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రొఫెసర్ కోదండరాం, మాడభూషి శ్రీధర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలు కవితా చల్లా, ఉపాధ్యక్షురాలు ప్రీతి చల్లా, పీవీ రావు, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాజిరెడ్డి పాల్గొన్నారు.













