ప్రవాస భారతీయల సేవలు ప్రశంసనీయం : గవర్నర్
కరోనా సంక్షోభ సమయంలో దేశానికి ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలు, సహాయం అమూల్యమైనవని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. అమెరికాలోని డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సర్వ్ అలయన్స్ అనే సంస్థ పంపిన 300 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను గవర్నర్ రాజ్‌భవన్‌లో ఆ సంస్థ హైదరాబాద్ ప్రతినిధులకు అందించారు. అనంతరం అమెరికాలోని ఆ సంస్థ ప్రతినిధులు రఘు చిట్టిమల్ల, విశ్వ కంది, శశితో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షోభ సమయంలో తెలుగు ప్రజల కోసం ఐటీ సర్వ్ అలయన్స్ చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలను గవర్నర్ అభినందించారు.
కొవిడ్ సెక్ండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ, ఆంధప్రదేశ్‌లో దాదాపు 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 20 వెంటిలేటర్ బెడ్స్ అందించామని ఐటీ సర్వ్ అలయన్స్ ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి కే సురేంద్రమోహన్, ఐటీ అలయన్స్ ప్రతినిధులు రవితేజ, వీ.ఆదినారాయణరెడ్డి, డీ.రామకృష్ణ, కే.ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.













