తెలంగాణ సచివాలయంలో గవర్నర్, సీఎం
సెక్రటేరియట్ సందర్శన కోసం గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ను తోడ్కొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. వారికి సచివాలయ ప్రాంగణాన్ని కలియదిరిగి చూయించారు. ఒక్కో ఫ్లోర్ గురించి వివరించారు. అనంతరం గవర్నర్ కు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలుకుతూ సీఎం తన ఛాంబర్ కి తోడ్కొని వెళ్ళి, శాలువాతో సత్కరించి పూల బోకెను అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి బొట్టు కుంకుమలతో గవర్నర్ గారిని సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు. అనంతరం హై ‘టీ’ తో గవర్నర్ కు సీఎం ఆతిథ్యమిచ్చారు.
ఈ సందర్భంగా సచివాలయ నిర్మాణ కౌశలాన్ని, ఏర్పాటు చేసిన అధునాతన మౌలికవసతుల వివరాలను గవర్నర్ సీఎంను అడిగి తెలుసుకున్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణం చాలా గొప్పగా ఉందని గవర్నర్ తమిళిసై కొనియాడారు. సీఎం ఆతిథ్యం స్వీకరించి కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇష్టా గోష్టి జరిపారు. అనంతరం సచివాలయ సందర్శనను పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణమైన గవర్నర్ గారికి ప్రధాన ద్వారం దాకా వెళ్ళి ముఖ్యమంత్రి వీడ్కోలు పలికారు.













