48 గంటల్లో నివేదిక ఇవ్వండి ..సీఎస్ ను ఆదేశించిన గవర్నర్
గ్రూప్ 2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, లోనవుతున్న ఒత్తిళ్లను ప్రవళిక మరణం మరోసారి గుర్తు చేస్తోందని గవర్నర్ తెలిపారు. నిరుద్యోగ యువత నిరాశకు లోను కావద్దని, ఉపాధి వేటలో ధైర్యంగా ముందుకెళ్లాలని కోరారు. యువతకు తన పూర్తి మద్దతు ఉంటుందని, ఉద్యోగ లక్ష్య సాధనలో వారికి పూర్తిగా అండగా నిలుస్తానన్నారు.













