గచ్చిబౌలిలో ప్రతిష్ఠాత్మక టిమ్స్ హాస్పిటల్
గచ్చిబౌళి క్రీడా గ్రామంలోని 1500 పడకల ఆసుపత్రిని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి (టిమ్స్)గా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందులో 750 సాధారణ పడకలు ఉంటాయని, మరో 750 మల్టీ స్పెషాలిటీ పడకలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఆసుపత్రిలో పీజీ వైద్యవిద్య సైతం ఉంటుందన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ స్థాయిలో అన్నిరకాల స్పెషాలిటీ వైద్యసేవలూ లభిస్తాయని తెలిపారు. టిమ్స్‌లో తొలుత కరోనా బాధితులకు చికిత్స అందిస్తామని, ఆ తర్వాత మరో 15 ఎకరాల భూమిని జతచేసి అద్భుతమైన స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు.
రాజధానికి నాలుగు దిక్కుల్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఒకవైపు ఇప్పటికే ఎయిమ్స్ వచ్చిందని, మరో వైపు గచ్చిబౌలిలోని టిమ్స్ కూడా అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. గచ్చిబౌలి క్రీడామైదానాన్ని 78 ఎకరాల పరిధిలో నిర్మించారన్నారు. అందులో కొంత స్థలాన్ని విల్లాలకు, ప్లాట్లకు కేటాయించడంతో సుమారు 9.16 ఎకరాల భూమి మిగిలి ఉందని, 14 అంతస్తుల్లో 540 గదులతో ఉన్న భవానాన్ని ప్రస్తుతం వైద్యారోగ్య శాఖకు కేటాయించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. సోమవారం నుంచే అక్కడ వైద్య సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు.













