తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)
2007లో హైదరాబాద్లో జరిగిన వరల్డ్ మిలిటరీ గేమ్స్ సందర్భంగా క్రీడాకారులకు వసతి కోసం గచ్చిబౌలి స్టేడియం సమీపంలో నిర్మించిన స్పోర్ట్స్ విలేజ్ (క్రీడా గ్రామం) భవంతి గత 13 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. కరోనా వైరస్ చికిత్స కోసం అర్జెంటుగా ఒక దవాఖాన కావలసి వచ్చినప్పుడు ఈ భవంతి అయితే తొందరగా సిద్ధం చేయవచ్చు అని నిర్ణయానికి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం గత మూడు వారాలుగా శ్రమించి ఈ భవంతిని వినియోగంలోకి తెచ్చింది. ఇవ్వాళ నుండి కొన్ని సేవలు ఇక్కడ మొదలవుతున్నాయి.
కోవిడ్ వల్ల జరుగుతున్న ఒక మేలు ఏమిటంటే అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో ప్రభుత్వాలు నూతన వైద్య సదుపాయాల మీద దృష్టి పెడుతున్నాయి. దీనివల్ల రేపటిరోజున పేదలకు మెరుగైన వైద్యం అందుతుంది అన్న ఆశ ఉన్నది.
ఇప్పుడు గచ్చిబౌలిలో రూపుదిద్దుకుంటున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) మొత్తం 1500 పడకల అత్యాధునిక దవాఖాన అని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు. మంత్రి ఈటెల రాజేందర్ గారు దీనిని నిత్యం పర్యవేక్షిస్తూ ఒక స్థాయికి తీసుకువచ్చారు.
కొసమెరుపు ఏమిటంటే, ముఖ్యమంత్రి, మంత్రులు అనేకసార్లు క్రీడా గ్రామ భవంతిని దవాఖానగా మారుస్తున్నాం అని చెప్పినా కొన్ని మీడియా సంస్థలు మాత్రం గచ్చిబౌలి స్టేడియంను హాస్పిటల్ గా మారుస్తున్నారు అని నిన్నటి నుండి రిపోర్ట్ చేయడం. ఇంకో అడుగు ముందుకువేసి ఏకంగా స్టేడియం ఫొటోలనే ఈ వార్తకు వాడుకోవడం.













