WTF: అమ్మభాషను అందలమెక్కించాలి… డబ్ల్యుటీఎఫ్ మహాసభలో పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి (HICC) వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు 3వరోజు కూడా వైభవంగా సాగాయి. ఉదయం జరిగిన కార్యక్రమాల్లో పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లేనని, అమ్మలాంటి తెలుగు భాషను అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పప్పు నెయ్యి కలిపి తినిపించినట్లు తెలుగు భాష మాధుర్యాన్ని తరువాతి తరాలకు అందించాలి. తెలుగువారు గొప్పవారే అన్న పేరు కన్నా, తెలుగు భాషను గొప్పగా చెప్పుకునేలా తెలుగువారు కృషి చేయాలి. వేర్లు భూమిలో ఉంది మొక్కను ఎలా సంరక్షిస్తుందో, అలాగే మనం కూడా మనమూలాలను కాపాడుకున్నప్పుడే భాష, సంస్కృతి పదిలంగా ఉంటుంది. మన భాషతోపాటు ఇతర భాషలను ప్రేమిద్దాం, ప్రాధమిక విద్యలో తెలుగును బోధిస్తున్నట్లే పరిపాలన వ్యవహారాల్లో కూడా మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. న్యాయస్థానాల్లో కూడా వాదనలు, తీర్పులు కూడా తెలుగులోనే ఉండేలా చూడాలని ఎం. వెంకయ్యనాయుడు కోరారు.
శ్రీ వెంకయ్య నాయుడు ముఖ్య అతిథి గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ శ్రీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీమతి కవితా దత్, కల్చరల్ చైర్ శ్రీ పీవీ సాయి పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర పూర్వ తెలుగు భాష అకాడమీ చైర్మన్ శ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ శ్రీ వెంకయ్య నాయుడు ని పరిచయం చేసారు.
మహాసభల్లో గత రెండురోజులుగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.