సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కె విజయరామారావు ఇకలేరు
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు (85) కన్నుమూశారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానకు తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ సాయంత్రం 7:30 గంటలకు తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. విజయరామారావు భౌతికకాయాన్ని మంగళవారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 3లోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచనునన్నట్లు తెలిపారు. ఆయన పార్థివదేహానికి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తావంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
విజయరామరావుకు ఇద్దరు కొడుకులు ప్రసాద్‌రావు, శ్రీనివాస్ కళ్యాణ్, కుమార్తె అన్నపూర్ణ ఉన్నారు. భార్య వసుమతి నిరుడు మృతి చెందారు. ఆయన చిన్నకొడుకు ప్రసాద్‌రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన రాగానే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. విజయరామారావు మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. విజయరామారావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడిరచారు. అందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు.













