ఇకపై రాజేంద్ర బీజేపీ నేత… బీజేపీలో చేరిన ఈటల రాజేందర్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. ఈటలకు పుష్పగుచ్ఛం ఇచ్చి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమతో పాటు ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. వీరందరికీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ తరుణ్ ఛుగ్ పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. వాస్తవానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ చేరాలి. కానీ అలా జరగలేదు. అయితే ఈటల బృందం, తెలంగాణ నేతలందరూ మధ్యాహ్నం నడ్డా నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్‌కు హాజరు కానున్నారు. అక్కడ ఈటలకు అధ్యక్షుడు నడ్డా పార్టీ కండువా కప్పనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.