తెలంగాణా ఎన్నికల సమరం
మినీ ఎన్నికల సంగ్రామం
5 రాష్ట్రాల్లో ఎన్నికలు… తెలంగాణాలో నవంబర్ 30న
దేశంలో మినీ ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో నవంబర్ 30వతేదిన ఎన్నికల నిర్వహించనున్నారు.. డిసెంబర్ మూడో తేదిన ఓట్ల లెక్కింపు చేపడతారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 7న, మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. చత్తీస్‌గఢ్‌లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న జరగనున్నాయి. రాజస్థాన్‌కి నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గతసారితో పోలిస్తే వారం రోజులు ముందే జర గనుంది. గత ఎన్నికల్లో డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించగా.. ఈసారి నవంబర్ 30వ తేదీనే జరగనుంది. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ నాటి నుంచి పోలింగ్ వరకు 51 రోజులు మాత్రమే గడువు మిగిలింది. ఈ ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల మహా సంగ్రామానికి ముందు జరిగే సెమీస్‌గా పార్టీలు భావిస్తున్నాయి. ఈ సెమిస్లో గెలుపు వచ్చే లోక్‌సభ ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తుందని పార్టీలు భావిస్తున్నాయి. అందువల్ల ప్రధానపార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ముమ్మరంగా పోరాడుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు అధికార కాషాయ దళానికి, విపక్ష కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అగ్నిపరీక్షగా మారాయి. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో తన అధికార పీఠాన్ని సుస్థిర పరుచుకోవాలంటే ప్రస్తుత ఎన్నికల్లో మెజార్టీ రాష్ట్రాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ ఇప్పటికే కదనరంగంలోకి దిగింది. మరోవైపు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలను కాపాడుకుంటూనే మరో రెండు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ కాలుదువ్వుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార మార్పిడి జరుగుతుందని బీజేపీ నమ్మకంగా ఉంటే.. బీజేపీ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌ను కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో రెండు పార్టీల పట్టు నిలుపుకునేందుకు, మిజోరంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు పోరాడుతుండటంతో ఈ ఎన్నికలు ఇప్పుడు రసవత్తరంగా మారాయి.
రాష్ట్రాల్లో పెద్దదైన మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు గానూ 2018 ఎన్నికల్లో 114 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి పదవి ఆశించి భంగపడ్డ జ్యోతిరాదిత్య సింధియా 2020లో సొంతపార్టీలోని 21 మంది ఎమ్మెల్యేలతో కాషాయ కండువా కప్పుకోవడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీనిపై ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న కాంగ్రెస్ అక్కడ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు చెమటోడ్చుతోంది. వరుసగా తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన కమల్‌నాథ్ ప్రస్తుతం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను బలంగా వాడుతున్నారు. బీజేపీ కూడా కేంద్ర మంత్రులు, లోక్‌సభ ఎంపీలను అసెంబ్లీ బరిలో నిలిపింది. కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న డిసెంబర్ 2018 నుంచి మార్చి 2020 మినహా దాదాపు రెండు దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది.
ఎన్నికలు జరిగే రాజస్తాన్‌లో ఏ ప్రభుత్వమూ వరుసగా రెండోసారి ఎన్నికకాని చరిత్ర ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు ప్రత్యర్థి పార్టీకి అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన తరగతుల ఓట్లే కీలకంగా ఉండటంతో వాటిపైనే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. కాంగ్రెస్‌కు చెందిన సీఎం గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య విరోధం నివురు గప్పిన నిప్పులా ఉంది. రాజస్తాన్‌లో కాషాయ జెండా రెపరెపలాడాలని చూస్తున్న బీజేపీ అక్కడ ‘ఆప్నో రాజస్తాన్’ పేరిట ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ నాలుగుసార్లు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరుమార్లు పర్యటించారు.
పదిహేనేళ్ల పాలన తర్వాత 2018లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎలాగైనా ఛత్తీస్‌గఢ్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. 90 స్థానాలున్న రాష్ట్రంలో 68 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు ఉన్న ఇమేజ్‌కు తోడు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు తమను తిరిగి అధికారంలోకి తేవొచ్చని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తోంది. రాష్ట్రంలోని కీలక రంగాల్లో జరిగిన అవినీతి తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది.
క్రైస్తవులు మెజారిటీగా ఉన్న మిజోరంలో స్థానిక పార్టీలైన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) పార్టీలదే హవా నడుస్తోంది. 40 స్థానాలున్న మిజోరంలో ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని ఎంఎన్ఎఫ్ ప్రభుత్వం 28 సీట్లతో అధికారంలో ఉండగా, జెడ్పీఎం 9 సీట్లు, కాంగ్రెస్ 5, బీజేపీ ఒక్క సీటు సాధించుకున్నాయి. ఈసారి గెలుపుకోసం ప్రధాన పార్టీలు ముమ్మరంగా యత్నాలు చేస్తున్నాయి.
కమ్యూనిస్టులు, ఇతర పార్టీలూ తెరపైకి..
కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం ఇటీవల కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు సిద్ధమయ్యాయి. కానీ చర్చలు కొలిక్కి రాలేదు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చేందుకు జాతీయ స్థాయిలో ఒప్పందం కుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. కొత్తగూడెం, మునుగోడులో సీపీఐ.. భద్రాచలం, కొత్తగూడెంలో సీపీఐకి కాంగ్రెస్ సీట్లు ఇస్తుందని అంటున్నారు. కానీ అధికారికంగా ఏదీ తేలలేదు. మరోవైపు ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కూడా కాంగ్రెస్‌తో కలసి పోటీచేయాలని భావిస్తున్నా.. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనం అంశం కూడా మరుగున పడింది. మరోవైపు బహుజన సమాజ్ పార్టీ తొలి విడత జాబితాను ప్రకటించింది. జనసేన, టీటీడీపీ వంటి పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహలు చేస్తున్నాయి.
తెలంగాణ అధికారం ఎవరిదో?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంకోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇక్కడ పోటీ త్రిముఖంగా ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్, తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ల మధ్య ప్రధాన పోటీ ఉందనుకుంటున్న తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితులతో బీజేపీ సైతం పోటీలోకి వచ్చింది. త్రిముఖ పోటీ ఉండే అవకాశాలతో తాము అధికారంలోకి వస్తామని బీజేపీ నమ్ముతుంటే, అతిపెద్ద పార్టీగా తామే అవతరిస్తామన్న గట్టి నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకతో ప్రధాన పార్టీలు ఇకపై పూర్తిస్థాయిలో గెలుపుకోసం తమ శక్తియుక్తులను కేంద్రీకరించనున్నాయి. అభ్యర్థుల జాబితాలు, మేనిఫెస్టోల ప్రకటన, ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, స్టార్ క్యాంపెయినర్ల ప్రచారం వంటివి ఊపందుకోనున్నాయి.
బీఆర్ఎస్ దూకుడు
ఈ ఏడాది మార్చి నుంచే ఆత్మీయ సమ్మేళ నాల పేరిట ఎన్నికల సన్నద్ధతను బీఆర్ఎస్ మొదలు పెట్టింది. అధికారిక కార్యక్రమాల పేరిట సీఎం కేసీఆర్, మంత్రులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. అంతేగాకుండా 50 రోజుల క్రితమే అంటే ఆగస్టు 21న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే పెద్దపీట వేయడంపై తలెత్తిన అసంతృప్తిని వివిధ నామినేటెడ్ పదవులు, ఇతర రూపాల్లో బుజ్జగించారు. పార్టీ టికెట్ దక్కని ఎమ్మెల్యేలు రేఖానాయక్, బాపూరావు రాథోడ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదనే కారణంతో ఎంపీ మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ను వీడారు. మరోవైపు గడిచిన పక్షం రోజుల్లోనే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సుమారు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయడం ఎన్నికల ప్రచార సభలను తలపించింది. పార్టీ మేనిఫెస్టో ప్రకటన, అభ్యర్థులకు బీఫారాల పంపిణీతోపాటు ఎన్నికల ప్రచార సభలకు కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారు.
గ్యారంటీలతో కాంగ్రెస్ అడుగులు
రైతు, యువత డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీ స్కీమ్‌ల ప్రకటన వంటి అంశాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. జాతీయ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపి, ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. తుక్కుగూడ బహిరంగ సభలో పార్టీ అగ్రనేతలతో హామీలు ఇప్పించింది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక కసరత్తుపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఎన్నికల మేనిఫెస్టోకు తుదిరూపునిచ్చి మరో పది రోజుల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. త్వరలో టీపీసీసీ నేతలు బస్సుయాత్ర ప్రారంభించనుండటంతో.. టికెట్ రానివారితో ఇబ్బందులు వస్తాయన్న భావన పార్టీలో వ్యక్తమైంది. దసరా పండుగ తర్వాత పూర్తిస్థాయిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం.
అగ్రనేతలను రంగంలోకి దింపుతున్న బీజేపీ
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో బీజేపీ ప్రచారం కోసం అగ్రనేతలను రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రుల పర్యటనలు ఖరారయ్యాయి. ఆదిలాబాద్‌లో బహిరంగ సభతో పాటు హైదరాబాద్‌లో వివిధ రంగాలకు చెందిన వృత్తినిపుణులు, మేధావులతో నిర్వహించే సమావేశంలో అమిత్‌షా పాల్గొన్నారు. ఈ నెల 27న కూడా అమిత్‌షా మరోమారు తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇక ఈ నెల 14న హైదరాబాద్ శివార్లలోని శేరిలింగంపల్లితో పాటు మరో నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, 15న ముషీరాబాద్‌తో పాటు మరోచోట కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పర్యటిస్తారని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 16న హుజూరాబాద్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పర్యటిస్తారని.. 19న మధిరలో కేంద్ర మంత్రి నారాయణస్వామి పర్యటిస్తారని తెలిపారు. మరో వైపు ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభలు నిర్వహించేందుకు బీజేపీ సిద్దమవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోకు ముఖ్య నేతలు తుదిమెరుగులు దిద్దుతున్నారు.













