రామోజీరావు అస్తమయం

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల అనంతరం గుండెకు స్టెంట్ వేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స అందించారు. చికిత్సపొందుతూ తెల్లవారుజామున మృతిచెందారు.
1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబసభ్యులు రామోజీకి.. తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పి.. తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన.
ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా ‘సితార’ సినీ పత్రిక నిలిచింది. అద్భుత ఫిల్మ్ సిటీ ని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.