కాలగర్భంలో కలిసిపోయిన టీఆర్ఎస్..! బీఆర్ఎస్ పయనమెటు..?
ఉద్యమ పార్టీగా గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి కాలగర్భంలో కలిసిపోయింది. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. దేశవ్యాప్తంగా చక్రం తిప్పాలని.. దీన్ని జాతీయ పార్టీగా తీర్చిదిద్దాలని కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ నే బీఆర్ఎస్ గా మార్చారు. ఇందుకు ఎన్నికల కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారికంగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో పార్టీ అధినేత కేసీఆర్ మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజాప్రతినిధులు, పెద్దఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీని ద్వారా టీఆర్ఎస్ పేరు మారి బీఆర్ఎస్ గా అధికారికంగా అవతరించింది. పేరు మార్పు కోసం కేసీఆర్ కొంతకాలంగా వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా గుజరాత్ ఎన్నికల ఫలితాల రోజే బీఆర్ఎస్ కు ఆమోదం తెలుపుతూ ఎన్నికల సంఘం లేఖ పంపింది. దీంతో బీఆర్ఎస్ ను పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14న ఢిల్లీ వెళ్లి అక్కడ భారత్ రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు పూర్తయినట్లు సమాచారం. అదే రోజు జాతీయ పార్టీ ఆఫీస్ బేరర్లను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2024 ఏప్రిల్ – మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకుముందే 2023 డిసెంబర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటిని ఎదుర్కోవడమే బీఆర్ఎస్ ముందున్న లక్ష్యం. ఈ రెండు ఎన్నికల మధ్య పెద్దగా గ్యాప్ లేకపోవడంతో తెలంగాణ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ – హరీశ్ రావ్ లాంటి వారిపైన పెడుతారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ బాధ్యతలను కేసీఆర్ తన భుజాలపై వేసుకుంటారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు జాతీయ స్థాయిలో సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది జాతీయ పార్టీలను ఏర్పాటు చేసి విఫలం చెందారు. కానీ కేసీఆర్ మంచి వ్యూహకర్త. చేపట్టిన పనిని కచ్చితంగా పూర్తి చేస్తారని పేరు తెచ్చుకున్నారు. ఇందుకు ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కోగల సత్తా ఉన్న నేత. అందుకే కేసీఆర్ అడుగులు జాతీయ స్థాయిలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ గా చేసుకునే కేసీఆర్ జాతీయ పార్టీ స్థాపించారని అందరూ భావిస్తున్నారు. ఆయన కూడా ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీనే తన ప్రధాన శతృవుగా కేసీఆర్ ప్రకటించబోతున్నారు.
తెలంగాణలో తప్పు ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ సత్తా చాటే అవకాశం కనిపించడం లేదు. అయితే రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలను కలుపుకు పోవడం ద్వారా తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. కర్నాటకలో జేడీఎస్, తమిళనాడు, మహారాష్ట్రలలో కూడా చిన్నాచితకా పార్టీలతో కలిసి బీఆర్ఎస్ పోటీ చేయాలనుకుంటోంది. తమతో కలసివచ్చే బీజేపీయేతర పార్టీలేవైనా.. వాటితో కలిసి వెళ్లాలని ప్రాథమికంగా కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెట్టనున్నారు. అలాగే పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో రైతు సంఘాలతో కలిసి ముందుకు వెళ్లేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. బీజేపీని దెబ్బకొట్టాలనే ఏకైక లక్ష్యంతోనే కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారు. మరి ఆయన తదుపరి మజిలీ ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.













