కవిత ‘టిఆర్ఎస్’కు ఈసీ గ్రీన్ సిగ్నల్..! కానీ చిన్న ట్విస్ట్..!!
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు తన రాజకీయ ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్న ఆమె కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, పార్టీ పేరు విషయంలో చిన్నపాటి మార్పుతో ఈ అనుమతి లభించింది. తొలుత ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని భావించినప్పటికీ, తుది ఆమోదం మాత్రం ‘తెలంగాణ రక్షణ సేన’ (టిఆర్ఎస్) పేరుతో లభించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
ఈ నెల 25న కవిత తన సొంత రాజకీయ ముద్రను వేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి (BRS)గా మార్చిన తర్వాత, ఆ పాత సెంటిమెంట్ పేరును మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె గట్టిగా నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ‘టీఆర్ఎస్’ అనే అక్షరాలు పోకుండా ఉండేలా జాగ్రత్త పడ్డారు. తొలుత ‘రాష్ట్ర సేన’ పేరును ప్రతిపాదించినా, సాంకేతిక కారణాల వల్ల అది ఈసీ వద్ద పెండింగ్‌లో పడింది. తాజాగా ‘తెలంగాణ రక్షణ సేన’గా పేరు ఖరారు కావడంతో కవిత వర్గం సంబరాల్లో మునిగిపోయింది.
ఇవి కూడా చదవండి
కవిత తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ నడుస్తోంది. గతంలో కేసీఆర్, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడు, తెలంగాణ సెంటిమెంట్‌ను వదిలేశారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కవిత మళ్ళీ అదే టీఆర్ఎస్ పేరుతో పార్టీని తీసుకురావడం ద్వారా ఆ సెంటిమెంట్‌ను పూర్తిగా తన ఖాతాలోకి వేసుకోవాలని చూస్తున్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్చే అవకాశం లేకుండా కవిత మాస్టర్ స్కెచ్ వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే, తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూనే, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకునే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు.
కవిత పార్టీ ప్రకటించినప్పటి నుంచి పేరు రిజిస్ట్రేషన్ విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. రాష్ట్ర సేన పేరు మీద అభ్యంతరాలు రావడం, ఈసీ నుంచి స్పష్టత లేకపోవడంతో కవిత అనుచరులు ఆందోళన చెందారు. కానీ, ఇప్పుడు ‘రక్షణ సేన’ పేరుతో అధికారిక ముద్ర పడటంతో ఆ సందిగ్ధత తొలగిపోయింది. తెలంగాణ ప్రయోజనాల రక్షణే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత వర్గం స్పష్టం చేస్తోంది.
కేసీఆర్ రాజకీయ వారసురాలిగా కేటీఆర్ పేరు బలంగా వినిపిస్తున్న తరుణంలో, కవిత సొంతంగా పార్టీని ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు దారితీస్తోంది. తండ్రి నిర్మించిన సామ్రాజ్యంలో భాగస్వామిగా కాకుండా, ఆ సామ్రాజ్యానికి మూలమైన ‘టీఆర్ఎస్’ పేరునే తన సొంతం చేసుకోవడం ద్వారా ఆమె కేడర్‌కు బలమైన సంకేతం పంపారు. రాబోయే రోజుల్లో ఈ ‘తెలంగాణ రక్షణ సేన’ ఏ మేరకు ప్రభావితం చూపుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి








