రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై ట్రోల్స్..!! మరీ తొందర ఎక్కువైందేమో..!?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి దావోస్ మంచి వేదిక. ఏటా దావోస్ సమ్మిట్ కు వెళ్లేందుకు పలు రాష్ట్రాలు, దేశాలు పోటీ పడుతుంటాయి. దావోస్ నుంచి ఆహ్వానం అందితే చాలనుకుంటాయి. ఆహ్వానం అందుకున్న దేశాలు, రాష్ట్రాలు తమ దగ్గరున్న అవకాశాలను ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు వివరించేందుకు, వారి నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎంతో శ్రమిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో దావోస్ పేరు చంద్రబాబు నాయుడితో బాగా పాపులర్ అయింది. అప్పట్లో ఆయన ప్రతి ఏటా దావోస్ వెళ్లి వచ్చేవారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రులు ఆయన బాటను అనుసరిస్తున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు.
గత నెలలోనే తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరింది. సరిగ్గా నెలన్నర కూడా కాలేదు. ఇంతలోనే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. కనీసం పాలనపై పట్టు కూడా సాధించలేదు. అన్ని శాఖలనూ కనీసం సమీక్షించలేదు. అయినా మనకోసం దావోస్ సమ్మిట్ ఆగదు కాబట్టి అక్కడికి వెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జయేశ్ రంజన్ లాంటి అధికారులను వెంటబెట్టుకుని అక్కడ వాలిపోయారు. అధికారుల దిశానిర్దేశం మేరకు రేవంత్ రెడ్డి తన ప్రయత్నాలేవో తాను చేస్తున్నారు. ఉన్నంతలోనే భారీగానే పెట్టుబడులు రాబోతున్నాయని తెలుస్తోంది.
అయితే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఓ నేషనల్ మీడియాకు రేవంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ ను వెక్కిరిస్తూ పలువురు మీమ్స్ తయారు చేశారు. గతంలో కేటీఆర్ దావోస్ పర్యటనలో మాట్లాడిన దాన్ని రేవంత్ మాట్లాడిన దాంతో పోల్చుతూ వీడియోలు వదిలారు. కేవలం భాషతో ఆగలేదు.. వేషంపైన కూడా రేవంత్ రెడ్డిని ఆడుకుంటున్నారు. కేటీఆర్ సూటూబూటుతో రేవంత్ డ్రెస్ ను పోల్చుతున్నారు. అసలు ఇలాంటి వాటికి రేవంత్ సరిపోడనేలా ఎవరికి వారు తీర్పులు ఇచ్చేస్తున్నారు.
అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఒకటుంది. కేటీఆర్ విదేశాల్లో చదువుకున్న దొరబిడ్డ. ఇంగ్లీష్ భాషపై పట్టుంది. రేవంత్ రెడ్డి చదువు హైదరాబాద్ దాటలేదు. పూర్తిగా కష్టపడి ఎదిగిన సామాన్యుడు. అలాంటి వాళ్లిద్దరినీ పోల్చడమే తప్పు. రాజకీయంగా కూడా అసలు వాళ్లిద్దరికీ పోలిక లేదు. కేసీఆర్ దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన వారసుడు కేటీఆర్. ఇంట్లో నిద్ర లేచింది మొదలు రాజకీయమే నడుస్తుంటుంది. ఇక రేవంత్ రెడ్డి కుటుంబానికి రాజకీయాలతో అసలు సంబంధమే లేదు. అలాంటి వాళ్లిద్దరినీ పోల్చడం సరికాదు. రేవంత్ బాధ్యతలు చేపట్టి నెలన్నరే అయింది. దావోస్ పర్యటన రద్దు చేసుకున్నా రేవంత్ ను అడిగేవారెవరూ ఉండరు. అది తన స్థాయి కాదని తెలిసీ రేవంత్ అక్కడికి వెళ్లేందుకు సాహసించారు. తన తంటాలేవో పడుతూ నెగ్గుకొస్తున్నారు. అలాంటివారిని అభినందించాలే కానీ విమర్శించడం సరికాదేమో..!













