ఆ ప్రచారంలో నిజం లేదు
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తాను ఓ హోటల్లో కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ అన్నారు. తనపై సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగానే అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది జాబితాలో తన పేరు లేకపోవడంపై బాధగా లేదని, తాను ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసినందువల్ల ఆ పదవిపై ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేదన్నారు. ఎన్నడూ లేని విధంగా ఒక్కసారే 105 మంది అభ్యర్థుల జాబితాను విడదల చేయడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్తి రావడం ఖాయమన్నారు తాను టీఆర్ఎస్లో బేషరతుగానే చేరానని, ఎలాంటి పదవులు ఆశించడం లేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడం ఖాయమన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు.













