Kunamneni: ముఖ్యమంత్రి ఒక్కరికే ఆ తపన ఉంటే సరిపోదు : కూనంనేని

ఏ ప్రభుత్వానికైనా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉంటుందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Sambasiva Rao) అన్నారు. విద్యాలయాలు, వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాల చర్చల్లో కూనంనేని మాట్లాడారు. విద్యాలయాలను బాగు చేయాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR )కు మొదట్లో ఉండేదని, ఆ తరువాత ఆయన అంచనాలు మారిపోయాయన్నారు. విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలనే కసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) లో కనిపిస్తోంది. స్కిల్స్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు నిర్ణయాలతో ఆ విషయం స్పష్టం అవుతోంది. అయితే ముఖ్యమంత్రి ఒక్కరికే ఆ తపన ఉంటే సరిపోదు. పైనుంచి కింద స్థాయి వరకు ఆచరించాలి. ప్రభుత్వ విధానాల వల్ల ఉపాధ్యాయులు సంతోషంగా లేరు. పాఠశాల విద్యకు సంబంధించి 20 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సర్వ శిక్షా అభియాన్ వాళ్లకు కనీస వేతనం అమలు చేయడం లేదు అని కూనంనేని పేర్కొన్నారు.