ఎన్నికల బ్రహ్మాస్త్రం…
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ పార్టీ.. అమ్ముల పొదిలోంచి అస్త్రాలను బయటకు తీసి సంధించింది. తుక్కుగూడ భారీ బహిరంగసభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆరు గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
1. మహాలక్ష్మి పథకం..
కర్నాటక తరహాలో మహిళలు, రైతులపై కాంగ్రెస్ మేనిఫెస్టో వరాల జల్లు కురిపించింది. కర్నాటక తరహాలో తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి క్యాబినెట్ భేటీలో హామీలను అమలు చేస్తామన్నారు. ఇందులో తొలి పథకం మహాలక్ష్మి.. ఈపథకం కింద ప్రతీ మహిళకు రూ.2,500 ఆర్థికసాయమందిస్తారు. దీంతోపాటు రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తామని హామీఇచ్చింది.
2. రైతు భరోసా
ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలుఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వరిపంటకు అదనంగా రూ.500 బోనస్ అందించనున్నారు.
3. గృహజ్యోతి
ఈ పథకం కింద ఇళ్లల్లో వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వనున్నారు.
4. ఇందిరమ్మ ఇళ్లు
ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం ఇస్తామని హామి ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్..
5. యువ వికాసం
విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు రూ. 5 లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం అందజేసి కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రయాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధనా పరికరాలు , స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకొనేలా సాయం చేస్తామని హామీలిచ్చారు. అలాగే ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని తుక్కుగూడ వేదికగా హామీ ఇచ్చారు.
6. చేయూత
పింఛనుదారులకు నెలకు రూ.4,000 పింఛను…..ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం. ఈ గ్యారెంటీలను రాహుల్ గాంధీ ప్రకటిస్తూ ‘‘కర్ణాటక మహిళలు ఇప్పుడు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అక్కడ మహిళలు మా జీవితాలు కాంగ్రెస్ పార్టీ మార్చిందని మాకు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చాక మహిళల జీవితాలను మారుస్తాం’’ అని చెప్పారు.
ఈ అస్త్రాలతోనే కర్నాటకలో కాంగ్రెస్ అధికార పీఠమెక్కింది. ఇప్పుడు తెలంగాణలోనూ అధికారాన్ని.. దక్కించుకుంటామని కాంగ్రెస్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.













