6 గ్యారంటీ స్కీములతో కాంగ్రెస్ ‘అభయ హస్తం’
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారానికి దూరమైంది. సాధారణంగా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన పార్టీకి ప్రజలు పట్టం కడతారు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువ కాలేకపోయింది. ఇందుకు పార్టీ కంటే నేతలే ఎక్కువ కారణం. నేతల మధ్య ఐక్యత లేకపోవడం, పార్టీకోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకోసం ఎక్కువ పాకులాడడం లాంటి కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారానికి చేరువ కాలేకపోయింది. పార్టీ తరపున గెలిచిన ఎంతోమంది ఎమ్మెల్యేలు గోడదూకడం, పార్టీ బలహీనపడడం లాంటివి కూడా ప్రజల్లో పలచన కావడానికి కారణాలు. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకోకపోతే ఐదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేల్కొంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో పని చేస్తోంది. ఇందుకోసం తమ దగ్గరున్న అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తోంది.
తెలంగాణ ఇచ్చినా పదేళ్ల పాటు అధికారానికి దూరం కావడాన్ని కాంగ్రెస్ పార్టీ అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఈసారి కచ్చితంగా కేసీఆర్ ను గద్దె దించి అధికారంలోకి రావాలని తపిస్తోంది. అధికారమే లక్ష్యంగా వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తోంది. దాదాపు ఆరు నెలల నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తమ మధ్య ఎన్ని విభేదాలున్నా హైకమాండ్ సూచనతో వాటిని పక్కన పెట్టి తమదైన శైలిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ పరిస్థితులపై ఆరా తీస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశానికి హైదరాబాద్ వేదికైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం హైదరాబాద్ తరలివచ్చాయి. దీన్ని బట్టి తెలంగాణకు కాంగ్రెస్ అధిష్టానం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో విజయభేరి సభ నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో సోనియా గాంధీ 6 గ్యారెంటీ పథకాలను అనౌన్స్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కర్నాటకలో కూడా ఇలాంటి గ్యారెంటీ స్కీములను హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ. అందుకే ఇక్కడ కూడా కర్నాటక తరహా ప్రణాళికనే అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మేనిఫెస్టోలో అభయహస్తం 6 గ్యారెంటీ స్కీములను చేర్చింది.
6 గ్యారంటీ స్కీములు ఇవే!
1. మహాలక్ష్మి పథకం
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.2500 చొప్పున అందించనున్నారు. అంతేకాక మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారు. అన్నిటికీ మించి రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ ధరను అందిస్తారు.
2. రైతు భరోసా పథకం
ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.15000 చొప్పున ఇస్తారు. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాక రైతు కూలీలకు ఏడాదికి రూ.12000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. వరి పంటకు క్వింటాల్ కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నారు.
3. గృహజ్యోతి
ఈ పథకం ద్వారా గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తారు.
4. ఇందిరమ్మ ఇళ్ల పథకం
ఈ పథకం కింద ఇళ్లు లేని వారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. ఇక తెలంగాణ అమర వీరులకు 200 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తారు.
5. యువ వికాస పథకం
ఈ స్కీమ్ ద్వారా కాలేజీ విద్య పూర్తి చేసిన యువతకు రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. అంతేకాక విద్యార్థులకు కోచింగ్ ఫీజును కూడా చెల్లిస్తారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు.
6. చేయూత పథకం
ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులకు నెలకు రూ.4000 పింఛను అందించనున్నారు. దళితులు, గిరిజనులకు దళిత బంధు, గిరిజన బంధు ద్వారా రూ.12 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. అంతేకాక ఈ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా కూడా అందిస్తారు.
మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అనీ.. తెలంగాణ కల సాకారం చెప్పి.. చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మిగిలిన పార్టీల లాగా ఎన్నికల్లో గెలవడానికి హామీలిచ్చి.. అధికారం చేపట్టిన తర్వాత వాటిని మర్చిపోయే పార్టీ కాంగ్రెస్ కాదని వివరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆయన కుటుంబం తప్ప మరెవరికీ లబ్ది జరగలేదనేది కాంగ్రెస్ ఆరోపణ. తెలంగాణ కోసం అందరూ పోరాడారని.. కానీ ఇప్పుడు లబ్ది పొందుతున్నది మాత్రం కేసీఆర్ కుటుంబం మాత్రమేననేది వారి ఆరోపణ. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కర్ణాటకలో సూపర్ సక్సెస్ అయిన గ్యారంటీ స్కీములు
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన ఆరు గ్యారెంటీ స్కీమ్ లు ఇప్పటికే కర్ణాటకలో ఆ పార్టీ అమలు చేస్తోంది. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ పథకాలు ఎంతో దోహదం చేశాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జరుగుతున్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పథకాలను అమలు చేసేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల వారీగా అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పుడు తెలంగాణలో కూడా దాదాపు కర్ణాటక తరహ స్కీములని తెరపైకి ఇచ్చింది. దళిత బంధు, గిరిజన బందు మినహా మిగిలిన పథకాలన్నీ కర్ణాటకలో అమలవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే దళిత బంధు అమల్లో ఉంది. దాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తామని, మెరుగైన ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అలాగే దళితులకు తోడుగా గిరిజనులకు కూడా ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. దీని ద్వారా లక్షలాది కుటుంబాలకు లబ్ధి జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం హామీ ఇచ్చిన అన్ని పథకాలను సమగ్రంగా విశ్లేషిస్తే మహిళలు, రైతులు, యువత, దళితులు, గిరిజనులను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తున్నట్లు అర్థమవుతుంది. తెలంగాణలో ఈ వర్గాలు నిర్ణాయక శక్తులు. అందుకే వీరిని మచ్చిక చేసుకోవడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉంది. తెలంగాణలో పురుషుల ఓట్లు కోటి 57 లక్షలు కాగా మహిళల ఓట్లు కోటి 56 లక్షలు గా ఉన్నాయి. అంటే దాదాపు పురుష ఓట్లకు సమానం. అందుకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, ఆసరా పెన్షన్ లాంటివి ప్రకటించింది. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు ఏదో ఒక రూపంలో లబ్ధి కలుగుతుందని తెలిపింది. దీనివల్ల మహిళలను ఆకట్టుకోవచ్చని హస్తం పార్టీ ఆలోచన. అలాగే యువతకు కోచింగ్ ఫీజు తో పాటు ఆర్థిక సాయం చేస్తాం అనడం కొత్త ఆలోచనగా ఉంది. దీనివల్ల యువత తమ పార్టీ వైపు ఆకర్షితులవుతారని భావిస్తోంది. రైతులకు గతంలోనే రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది.
ప్రస్తుతం కేసీఆర్ రుణమాఫీ ప్రకటించి దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతులను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో పథకాలను అనౌన్స్ చేసింది. రైతులకు మాత్రమే కాకుండా కౌలు రైతులు, కూలీలను కూడా ఆకట్టుకునేలా ఆర్థిక సాయం ప్రకటించింది. దీనివల్ల ఖచ్చితంగా రైతులందరూ తమ పార్టీ వైపు చూస్తారని నమ్ముతోంది. ఇక దళిత బందును మరింత మెరుగుపరిచి అమలు చేస్తామని చెప్పింది. దళిత బంధుతరహాలోనే గిరిజనులకు గిరిజన బంధును తెరపైకి తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనౌన్స్ చేసిన పథకాలు ఏవి ప్రస్తుతం తెలంగాణలో అమల్లో లేవు. ఈ తరహా పథకాలు అమల్లో ఉన్న ఈ స్థాయిలో నగదు బదిలీ చేయడం లేదంటే ఆర్థిక సాయం చేయడం అనేది కొత్త ఆలోచన.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీములను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఆ పార్టీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. నియోజక వర్గాల వారీగా ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి ఆరు పథకాలను ప్రజలకు వివరించాలని ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో బిజీగా ఉన్నారు. ఇంటింటికి వెళ్లి అభయహస్తం పథకాలను వివరిస్తున్నారు. తమకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు.
మేనిఫెస్టో ప్రకటనలో కాంగ్రెస్ దూకుడు
ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించేసి బరిలోకి దూకింది. బీజేపీ ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నేడోరేపో ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ రెండో వారం లోపు అభ్యర్థులను ప్రకటించాలని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే ఆ రెండు పార్టీల కంటే ముందే మేనిఫెస్టో ప్రకటించి కాంగ్రెస్ పార్టీ సంచలనం సృష్టించింది. కర్నాటకలో కూడా ఇదే తరహా దూకుడుతో అధికారాన్ని సొంతం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. కర్నాటకలో ఆయన స్ట్రాటజీ సూపర్ సక్సెస్ అయింది. అందుకే తెలంగాణ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. మరోవైపు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు తెలంగాణ బాధ్యతలను అప్పగించింది. అభ్యర్థిల ఎంపిక మొదలు స్ట్రాటజీ వరకూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో ప్రకటన ఢిల్లీ కేంద్రంగా జరిగేవి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కానీ ఇవి జరిగేవి కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీరు మారింది. కనీసం ఎన్నికల షెడ్యూల్ కూడా రాకముందే మేనిఫెస్టో అనౌన్స్ చేసేసింది. మిగిలిన పార్టీలకు అందనంత దూరంలో నిలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా ఇంతవరకూ మేనిఫెస్టో జోలికి పోలేదు. ఇక బీజేపీ పూర్తిగా డీలా పడింది. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో చాలా ముందుంది. మేనిఫెస్టో ప్రకటించడం ఒక ఎత్తయితే జనాకర్షక్ పథకాలను అనౌన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్టీ ప్రకటించిన అభయ హస్తం 6 గ్యారంటీ పథకాలపై తెలంగాణలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇవన్నీ కర్నాటక హామీలే అని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నా ప్రజల్లో మాత్రం మంచి స్పందన లభిస్తోంది. వీటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత మరింత స్పీడ్ పెంచేందుకు సిద్ధమవుతోంది.
విపక్షాలు మరింత మెరుగైన పథకాలు ప్రకటిస్తే…!?
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీములకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. నేతల మధ్య ఎన్ని విభేదాలున్నా వాటన్నిటిని పక్కన పెట్టి పార్టీ కోసం పని చేస్తున్నారు. మేనిఫెస్టోకు మంచి రెస్పాన్స్ రావడంతో నేతల్లో మరింత జోష్ వచ్చింది. అయితే బీఆర్ఎస్, బీజేపీలు ఇంతకంటే మెరుగైన పథకాలతో ముందుకొస్తాయేమోననే టెన్షన్ కాంగ్రెస్ పార్టీకి పట్టుకుంది. వాళ్లు 4వేలు పెన్షన్ ఇస్తే మేము ఇవ్వలేమా అని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో తర్వాత తదనుగుణంగా కేసీఆర్ కూడా మరిన్ని ప్రజాకర్షక పథకాలను మేనిఫెస్టోలో చేరుస్తారేమో అని భావిస్తున్నారు. ఇంతకంటే మెరుగైన స్కీములు బయటికొస్తే కాస్త ఇబ్బంది ఉంటుందేమోనని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అయితే అందరికంటే ముందుగా తామే ఈ పథకాలు ప్రకటించాం కాబట్టి తమను కాపీ కొట్టారని చెప్పేందుకు కాంగ్రెస్ కు అర్హత లభిస్తుంది. ఇదే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించింది.
ఐకమత్య లోపమే అసలైన సమస్య
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీములకు అద్భుత స్పందన లభిస్తోంది. అయితే ఆ పార్టీకి నేతల మధ్య ఐక్యత లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే ఆయనపై విమర్శలు చేస్తున్నారు. పార్టీలో ముందు నుంచి ఉన్న నేతలంతా కొత్తగా వచ్చిన వారిపై గుర్రుగా ఉన్నారు. అయితే పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తుండడంతో సీనియర్లు ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. పదేళ్లుగా ఈ సీనియర్లకు అన్ని అవకాశాలు ఇచ్చినా పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారనే భావన హైకమాండ్ కు ఉంది. అందుకే సీనియర్లు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డికే అండగా నిలుస్తోంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే పని చేయాలని.. అలా పనిచేయడం ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది. దీంతో నేతలు కాస్త దిగి వచ్చారు. ఇప్పుడిప్పుడే కాస్త దారిన పడుతున్నారు.
మరోవైపు పార్టీలోకి భారీగా నేతలు వలస వస్తున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ స్వరూపం మారింది. కేసీఆర్ ను ఓడించే సత్తా ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉందని పలువురు భావిస్తున్నారు. అందుకే చాలా మంది నేతలు ఇప్పుడు పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా హస్తం కండువా కప్పుకుంటున్నారు. దీంతో పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే ఉత్సాహంతో ఎన్నికలు ఎదుర్కోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇలా కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇంతే అన్నట్టు పాత పద్ధతిలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ.. ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకుంటూ వెళ్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది.
– సి.ఎల్.ఎన్.రాజు
సీనియర్ జర్నలిస్ట్













