తెలంగాణలోనూ కర్నాటక మోడల్… డీకే ఆధ్వర్యంలో కార్యాచరణ!?
కర్నాటక ఎన్నికల్లో విజయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అననుకూల పరిస్థితుల్లో సాధించిన విజయం కావడంతో ఆ పార్టీలో మంచి జోష్ తీసుకొచ్చింది. కేడర్ ఒక్కసారిగా బలోపేతమైంది. డీలా పడిపోయిన రాష్ట్రాల్లో కూడా పార్టీ శ్రేణులు మళ్లీ హుషారుగా పనిచేయడం ప్రారంభించాయి. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల ప్రభావం పొరుగునే ఉన్న తెలంగాణపై ఎక్కువ ప్రబావం చూపిస్తోంది. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సమయంలో కర్నాటక మోడల్ ను అనుసరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇందుకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆధ్వర్యంలో కార్యాచరణ రెడీ అవుతోంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తోంది. కర్నాటక మోడల్ ను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. కర్నాటకలో నేతల మధ్య ఎన్ని విభేదాలున్నా వాటిని పక్కన పెట్టి కేవలం పార్టీ గెలుపుకోసమే పని చేశారు. ఇది అక్కడ వర్కవుట్ అయింది. గెలిచిన తర్వాత పదవులు, పంపకాలపై ఆలోచించారు. అప్పటి వరకూ ఒకటే లక్ష్యంతో పని చేశారు. అదే సమయంలో మేనిఫెస్టోను కూడా పకడ్బందీగా రూపొందించారు. బీజేపీ హామీలు ఇస్తే వాటిని పట్టించుకోదని, కానీ కాంగ్రెస్ అలా కాదని చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చి అమలు చేసిన విషయాన్ని పదే పదే గుర్తు చేశారు. అది అక్కడ వర్కవుట్ అయింది. ఇప్పుడు సేమ్ స్ట్రాటజీని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ.
కర్నాటకలో రెండు మూడు స్కీములు బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ భృతి లాంటివి సూపర్ సక్సెస్ అయ్యాయి. వీటని అప్పుడే అమలు చేయడం కూడా ప్రారంబించింది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ స్కీములనే తెలంగాణ సహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్.. లాంటి రాష్ట్రాల్లో అమలు చేయాలని హస్తం పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి సంక్షేమంపైనే ఆధారపడుతూ వస్తోంది. కానీ బీజేపీ మాత్రం ఉచితాలకు, సంక్షేమానికి దూరంగా ఉంటోంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణలో కర్నాటక మోడల్ ను అమలు చేసే బాధ్యతను డీకే శివకుమార్ కు అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని డీకేతో కోఆర్డినేట్ చేసుకోవాలని సూచించింది. కర్నాటకలో ఎన్నికల స్ట్రాటజీని పూర్తిగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసేంత వరకూ డీకే శివకుమార్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీలో చేరికలు, సీట్ల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, నేతల మధ్య విభేదాల పరిష్కారం.. లాంటి అనేక అంశాలపై డీకే సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. వాటిని అమలు చేస్తూ తెలంగాణలో సత్తా చాటాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ.













