బీసీ మంత్రం..
కర్నాటకలో బీజేపీపై గెలుపుతో కాంగ్రెస్ అదే ఫార్ములాను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని భావిస్తోంది. అక్కడిలాగే టికెట్ల కేటాయింపులో బీసీలకు పెద్దపీట వేసేలా పావులు కదుపుతోంది. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా బలమైన బీసీ నేతలెవరు.., టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి.. అనే కోణంలో అంతర్గత సర్వేలు చేయిస్తోంది. తెలంగాణలో బీసీ సామాజికవర్గం అధికంగా ఉన్నందున వారి మద్దతు సంపాదించే కోణంలోనే ఎక్కువగా ప్రచారం చేయాలని రాష్ట్ర పార్టీ నేతలకు అధిష్ఠానం నుంచి సూచనలు అందాయి. ఏ ఒక్క సామాజిక వర్గానికో ఎక్కువ టికెట్లు ఇస్తున్నారని గానీ, ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని కానీ అనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రేకు అధిష్ఠానం సూచించింది.
దేశవ్యాప్తంగా కులగణన జరపాలని రాహుల్‌గాంధీ సైతం డిమాండు చేయడం వెనుక బీసీ వర్గాలకు చేరువ కావాలనే లక్ష్యం ఉందని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో దానిని అమలుచేసి చూపాలని అగ్రనేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించారు. కనీసం 40 శాతానికి తగ్గకుండా అవసరమైతే 50 శాతం టికెట్లు తప్పనిసరిగా వారికే ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీలకు నిర్దేశిత రిజర్వుడు సీట్లు ఇవ్వడంతో పాటు, మిగిలిన వాటిలో బీసీలకే అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు అధిష్ఠానానికి సూచించారు.
మరోవైపు…ఎన్నికల్లో కీలకమైన మేనిఫెస్టోపైనా కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీఆర్ ఎస్ సంక్షేమ పథకాలతో జనంలోకి వెెళ్తుండడంతో.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న దాన్ని వివరించడంపై కసరత్తు చేస్తోేంది.ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా ఆగకుండా ఈలోగానే మేనిఫెస్టో తయారీకి ప్రత్యేకంగా కమిటీ వేయాలని నిర్ణయించింది. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి మొదటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటామని ముందే ప్రచారంలో చెప్పామని, అదే విధానాన్ని తెలంగాణలోనూ అనుసరించాలని పార్టీ నిర్ణయించింది. కచ్చితంగా అమలుచేయగలిగే హామీలనే మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజలకు వివరించాలని గెలిచాక అమలుచేసి తీరాలని అధిష్ఠానం సూచించింది.
ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్… గతంలో దిల్లీ, పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలిచాయి. రైతులకు రుణమాఫీ, అన్ని ఇళ్లకు కొంతమేర ఉచిత విద్యుత్ వంటివి అమలుచేయాలంటే ఎంత వ్యయమవుతుందనే కోణంలో అంతర్గతంగా లెక్కలు వేస్తున్నారు. కర్ణాటకలో 200 యూనిట్ల వరకూ ఇళ్లకు ఉచిత విద్యుత్, మహిళలకు బస్సులో ఉచిత రవాణా, ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలో రూ.2 వేలు జమ అంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మంచి ఆదరణ లభించిందని.. ఇలాగే తెలంగాణలోనూ ప్రజల సంక్షేమానికి మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యమిస్తామని నేతలు తెలిపారు.













