టీఆర్ఎస్ బాటలోనే బీజేపీ… జీవన్ రెడ్డి
టీఆర్ఎస్ పాలనలో శాసనసభ్యుల కొనుగోలు జరిగిందని, ఇప్పుడు అదే బాటలో బీజేపీ నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు దొంగ ఆటలు ఆడుతున్నాయని అన్నారు. ఇప్పటి వరకు స్థానిక నాయకుల కొనుగోల్లే జరిగాయని, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలను కొంటున్నారని, ఇది రాజకీయ వికృత క్రీడకు పరాకాష్టని అన్నారు. బీజేపీకి చెందిన స్వామీజీలు రాయబారం నడిపారని తెలుస్తోందని అన్నారు. బీజేపీ ఎంచుకున్న నాలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు వెళ్లిన వారేనన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను లొంగదీసుకోవడం ఈజీ అని అందుకే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను ఎంచుకున్నారన్నారు.
మంత్రులు తలసాని, మల్లారెడ్డి లాంటి వారిని టీఆర్ఎస్లో చేర్చుకున్న విషయం సీఎం కేసీఆర్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కేసీఆర్ కుట్ర అని, ఇంత దుర్మార్గపు చర్య ఎప్పుడు ఊహించలేదన్నారు. ఈ ఘటన ఎన్నికల కమిషన్ నిబంధలన కిందకు వస్తుందని, ఈసీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను డిస్ క్యాలిఫై చేయాలన్నారు.













