Bandi Sanjay: కరీంనగర్ అభివృద్ధి బాధ్యత నాదే : బండి సంజయ్
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులెత్తేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ (Bandi Sanjay Kumar) వ్యాఖ్యానించారు. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ (Karimnagar) కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ల్లో ఆయన మాట్లాడారు. ఘోర ఓటమి తథ్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మేయర్ ( Mayor) పదవి ఇచ్చేందుకు లోపాయికారి ఒప్పందం చేసుకుందన్నారు. ఓటమిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారంతోనే సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్‌కు రాకుండా చొప్పదండి నుంచే పారిపోయారని ఎద్దేవా చేశారు.
ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకొని పోయే దొంగలా చూస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. అలాంటి చెప్పుల దొంగకు ఎన్నికల్లో ఓట్లు ఎందుకు వేయాలి? బజార్లో అప్పు కూడా పుట్టని వ్యక్తిని నమ్ముకుని ఏం లాభం. నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు? అంటూ ప్రశ్నించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలపై నిలదీయాలన్నారు. బీఆర్ఎస్ నేతలు వస్తే, పదేళ్ల పాలనలో దోచుకుతిన్నందుకు ఓటేయాలా అని ప్రశ్నించాలని కోరారు. పొరపాటున ఆ పార్టీలకు ఓటేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించి అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేస్తారని చెప్పారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి అప్పగిస్తే దాని అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని ప్రకటించారు. తాను ముస్లింలకు వ్యతిరేకం కాదని, ముస్లింలను భయపెట్టి కంట్రోల్లో పెట్టుకునే ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకమని ఆయన చెప్పారు.













