ఎయిమ్స్ లో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రావాలి : సీఎం రేవంత్
తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్‌లో మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. బీబీనగర్ ఎయిమ్స్‌లో వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా చేస్తే ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపైనా భారం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎయిమ్స్‌ను సందర్శించిన నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే తాను స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని వెల్లడించారు.













