కొత్త తరానికి ఆయన పోరాట స్ఫూర్తి : కేసీఆర్
అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు కొత్త తరానికి ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేశాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బ్రిటీష్ బంధనాల నుంచి భారతమాత విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి. అల్లూరి గొప్పతనాన్ని, చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలి. అల్లూరి సీతారామరాజు దైవాంశ సంభూతుడని భావిస్తా. మహా కవి శ్రీశ్రీ అల్లూరి గురించి రాసిన తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా, మాలో నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా సినిమా పాట చాలా పాపులర్ అయింది. ఆ పాటను నేను చాలా ఇష్టంగా వినేవాడిని. 26 సంవత్సరాల పిన్న వయసులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచారు. భరతజాతి చెప్పుకొనే ఎంతో మంది అమరవీరుల సరసన మేము తక్కువ కాదు అని మన తెలుగుజాతిని నిలబెట్టిన గొప్ప మహనీయుడు అల్లూరి అని కొనియాడారు.













