13 ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. రూ.3వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న నెల్లికల్లు ఎత్తిపోతలతో పాటు మరో 12 ఎత్తిపోతల పథకాలు, అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కొత్తగా చేపట్టనున్న ఎత్తిపోతల పథకాల ద్వారా హుజూర్ నగర్, సాగర్, దేవరకొండ పరిధిలోని చివరి భూములకు సాగునీరు అందనుంది. యాదాద్రి జిల్లాలోని గంధమల్ల, బస్వాపూర్ గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. ఎత్తిపోతలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చివరి భూములకు కృష్ణా జలాలు చేరనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ బడుడుల లింగయ్య యాదవ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర నాయక్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.













