నా కూతురిపై కూడా బీజేపీ ఒత్తిడి.. సంచలన ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై పార్టీ మారాలని బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చారా? అంటే అవుననే అంటున్నారు కేసీఆర్. రాష్ట్రంలోనే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య కూడా అగ్గిపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించడం దారుణమని, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలపై బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రానికి ఏపీ సీఎం జగన్ అనుకూలంగానే ఉన్నా కూడా.. వైసీపీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని చెప్పారు. ఇలా ఒక జాతీయ పార్టీ.. ప్రాంతీయ పార్టీలపై కుట్రలు చేయడం కంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా? అని కేసీఆర్ నిలదీశారు. ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేలను పార్టీ మారాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని చెప్పిన ఆయన.. ఎవరెవరు ఏం చేస్తున్నారో? ఎవరితో మాట్లాడుతున్నారో తనకు అన్నీ తెలుసని, ఇలాంటి పనులు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీకి ఎవరూ తల వంచొద్దని తమ పార్టీ నేతలకు ధైర్యం చెప్పిన ఆయన.. ఈ సమావేశంలో మాట్లాడుకున్న వివరాలు ఎవరికీ చెప్పొద్దని, ఈ విషయంలో అందరిపై నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.













