హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సు

హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన ప్రతిష్ఠాత్మక సదస్సులైన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్), వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఐటీ (డబ్ల్యుసీఐటి)కి కొనసాగింపుగా మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు రాజధాని వేదికైంది. ఆగస్టు 3, 4 తేదీల్లో ఇంటర్నేషనల్ బ్లాక్ చైన్ కాంగ్రెస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన న్యూక్లస్ విజన్ సంస్థ, నీతిఆయోగ్‌తో కలిసి సదస్సును నిర్వహిస్తున్నది. మూడు రోజుల సదస్సులో తొలి రెండురోజులు హైదరాబాద్‌లో, ముగింపు సమావేశం గోవాలో జరుగనున్నది.
హైదరాబాద్ మారియట్ హోటల్ మీడియా సమావేశంలో న్యూక్లస్ విజన్ సీఈవో అభిషేక్ పిత్తి, సీఎంవో మార్టిన్ డుడ్లీ, టీ హబ్ ఉపాద్యక్షుడు రమా అయ్యార్‌తో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వివరాలు వెల్లడించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ పరిశ్రమ నిష్టాతులు, రెగ్యులేటర్లు, సాంకేతిక, స్టార్టప్ ఆవిష్కర్తలతో సమావేశం జరుగనున్నదని తెలిపారు. కీలక సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకోనున్నది తెలిపారు. ప్రముఖ సంస్థల ప్రతినిధులతో, ఆవిష్కర్తలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నరని వివరించారు.
హైదరాబాద్ ను మరోసారి గుర్తుచేసుకొన్న ఇవాంక
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్)కు హాజరైన అమెరికా అధ్యక్షుడు కుమార్తె ఇవాంక ట్రంప్ తిరిగి అమెరికా వెళ్లాక హైదరాబాద్ విశిష్టతను, ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ లేఖ రాశారు. తాజాగా మరో సారి అమె హైదరాబాద్‌ను గుర్తు చేశారు. ఇటీవల అమెరికాలో ఎకనమిక్ బిజినెస్ అడ్వైజరీ సమావేశంలో ఇవాంక పక్కన అడోబ్ సంస్థ సీఈవో, హైదరాబాదీ శంతన్ నారాయణ కూర్చున్నారు. గత ఏడాది హైదరాబాద్‌లో జీఈఎస్‌కు ఇచ్చిన ఆతిథ్యం బాగుంది. సుహృద్భావ వాతావరణం, చక్కటి సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు. కట్టడాలు, సౌందర్యానికి నెలవు అంటూ ఇవాంక తన అనుభూతులను శంతన్తో పంచుకున్నట్టు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ తెలిపారు.











































































