దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి విజయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడించి సంచలనం సృష్టించింది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్ఎస్ కంచుకోటలో కాషాయ జెండా ఎగరేసింది. టీ-20 మ్యాచ్‌లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా.. అనుహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ 11 నుంచి 20 రౌండ్ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది. దీంతో టీఆర్ఎస్ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. చివరి నాలుగు రౌండ్స్‌లో బీజేపీ లీడ్‌లోకి వచ్చి.. ఉత్కంఠకు తెరదించింది. వరుసగా 20,21,22,23 రౌడ్స్లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.













