మళ్ళీ ఇలా జరిగితే తిరగబడక తప్పదు.. రాళ్ల దాడిపై కేటీఆర్ వార్నింగ్
మునుగోడులో జరిగిన రాళ్ల దాడిలో గాయపడిన పలువురిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఆయన పరామర్శించిన వారిలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కూడా ఉన్నారు. ఈ సమయంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ కూడా కేటీఆర్ వెంట ఉన్నారు. దాడికి పాల్పడిన బీజేపీ కార్యకర్తలపై ఈ సందర్భంగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా హింసకు పాల్పడుతూ, దాన్ని ప్రోత్సహించే సిద్ధాంతాన్ని తిప్పికొట్టే శక్తి, సత్తా తమకు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. ఇదే హింస సంస్కృతిని కొనసాగిస్తే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని, తమపై దాడి చేసే వారికి బుద్ది చెప్పక తప్పదని హెచ్చరించారు. సానుభూతి నాటకాలు మంచివి కాదని హితవు చెప్పారు.
అలాగే మునుగోడు ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలియడంతోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇద్దరు ఇక్కడకు రాలేదని కేటీఆర్ చెప్పారు. గత 8 ఏళ్లలో రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఇలాంటి ఉద్రిక్తతలకు తావు ఇవ్వలేదని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. పలివెలలో జరిగిన రాళ్ల దాడిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్‌తో పాటు మొత్తం 12 మంది కార్యకర్తలు గాయాలపాలయ్యారు అని ఆయన తెలిపారు.













