రాజన్న రాజ్యం కాదు… రామరాజ్యం కావాలి
జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతు ఊహించిందేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండ జిల్లా హాలియా సభలో దివంగత ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ సంతాపం కూడా తెలపలేదని ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇవ్వడం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం సీఎంకు పరిపాటి అని విమర్శించారు. గిరిజన మహిళల పట్ల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పార్టీ పెట్టబోతున్నందున వైఎస్ షర్మిలకు అర్వింద్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్యం అవసరం లేదని రామరాజ్యం కావాలని చెప్పారు. ఆరోగ్యశ్రీ జమనా అయిపోయిందని, ఇప్పుడు ఆయుస్మాన్ భారత్ జమనా వచ్చిందన్నారు. తెలంగాణలో అవినీతికి తావులేదని, నరేంద్రమోదీ క్లీన్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలకు కావాలని సిస్టర్ షర్మిలకు చెబుతున్నానని అన్నారు.













