ఇప్పుడు కూడా మళ్లీ అదే ప్లాన్ లో
టీఆర్ఎస్, ఎంఐఎం తీరును ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్కు ఎంఐఎం మద్దతిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో తమ మధ్య పొత్తులేదని ఆ రెండు పార్టీలు ప్రకటించాయని, ఇప్పుడు మేయర్ ఎన్నికలో ఎలా మద్దతు తెలిపారని ప్రశ్నించారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. మేయర్ పదవికి పోటీలో ఉంటామని ప్రకటించిన ఎంఐఎం.. టీఆర్ఎస్కు ఎందుకు మద్దతిచ్చిందని నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే టీఆర్ఎస్కు 15 సీట్లకు మించి వచ్చేవి కాదని అన్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్‌ను ఇద్దరు దొంగలు కలిసి నాశనం చేశారని, ఇప్పుడు కూడా అదే ప్లాన్‌లో ఉన్నారని ఆరోపించారు. ఇద్దరు దొంగలు ఒకటేనని ఇవాళ రుజువైందని, ప్రజలు గమనించాలని కోరారు.













