ఈ కథ చూస్తే అలా అనిపిస్తోంది : లక్ష్మణ్
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే అట్టర్ ప్లాప్ అయినట్టు ఈ కథ చూస్తే అలా అనిపిస్తోంది. కథ స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, హీరో, విలన్ అంతా వాళ్లే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకుడి ఫామ్‌హౌస్, డబ్బులు, యంత్రాంగం, పోలీసులు అంతా వారే. కేవలం మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతున్నామనే ఇంతా చేస్తున్నారు. దేశంలో ఎన్నో ఉప ఎన్నికలు జరిగాయి. ఎక్కడైనా ఇక నియోజకవర్గంలో 83 మంది ఎమ్మెల్యేలు మోహరించారా? మంత్రులు, ఎమ్మెల్సీలు నెల రోజుల నుంచి అక్కడే మకాం వేశారు. ఎన్ని చేసినా అక్కడ గెలిచే అవకాశం లేదని చెప్పి ఈ విధంగా కథలు సృష్టిస్తున్నారు. ఈ నాలుగైదు రోజుల్లో ఇంకా ఎన్ని కథలు సృష్టిస్తారో చూడాలన్నారు.
గతంలో కూడా మంచి స్టోరీ చూశాం. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు రూ.కోట్లు సుపారీ ఇచ్చారని కథ అల్లారు. ఆ కథ కంచికేనా. దానికి కారకులైన వారు టీఆర్ఎస్ ప్లీనరీలో సెల్ఫీ దిగిన ఉదంతాలు చూశాం. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. మునుగోడులో ఓడిపోయినంత మాత్రాన ప్రభుత్వం పడిపోయేది లేదు. ఎందుకింత ఆక్రోశం. ఇలాంటి కట్టు కథల ద్వారా ప్రజల దృష్టి మరల్చలేరు అని అన్నారు.













