ఆస్ట్రియాలో బతుకమ్మ ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ పండుగ బతుకమ్మ. ఈ పండుగ సంబురాలను ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రియా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన నివాసంలో సంస్థ ప్రతినిధుల సమక్షంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందనీ, విదేశాల్లో సైతం బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం బతుకమ్మ అని చెప్పిన మంత్రి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆస్ట్రియాలో ఈ మహా బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా ఆమె బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రితో పాటు తెలంగాణ అసోసియేషన్ ఆస్ట్రియా ప్రతినిధులు మేడిపల్లి మధుసూదన్‌రెడ్డి, వేముల సాగర్, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.













