మునుగోడు ఉప ఎన్నికప్పుడే.. ఇవన్నీ గుర్తుకు వచ్చాయా? : బండి సంజయ్
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంటే, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను కొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మర్రిగూడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడు ప్రజలకు ఏం చేస్తారో సీఎం కేసీఆర్ చెప్పలేదని, మళ్లీ గెలిచినా చేసేదేమీ లేదని అన్నారు. ఉప ఎన్నికలో ఓడిపోతామని తెలిసినా, చండూరు సభలో సీఎం కేసీఆర్ పోకపోతు గాంభీర్యం ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. 2018లో ఎన్నికల సందర్భంగా చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేశారా? చేనేత సహకార సంఘాల ఎన్నికల ఎందుకు నిర్వహించడం లేదు? ప్రశ్నించారు. చేనేత ముడిసరుకులపై 50 శాతం రాయితీ ఎందుకివ్వడం లేదు? చేనేత బీమా ఎంతమందికి ఇచ్చారు? అని ప్రశ్నించారు.
చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీకి ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఆమోదం తెలపలేదా? జీఎస్టీలో రాష్ట్ర వాటాగా 2.5శాతం తీసుకుంటున్నారు. ఎందుకు తగ్గించడం లేదు? మునుగోడు ఉప ఎన్నికప్పుడే ఇవన్నీ గుర్తుకు వచ్చాయా? డిరడి ప్రాజెక్టు ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు ఏమైంది? అభివృద్ధి గురించి మాట్లాడలేదు. ఏ కులానికి ఏం చేస్తారో కేసీఆర్ చెప్పలేదు. టోపీ పెట్టుకుని వచ్చి మునుగోడు ప్రజల నెత్తిన టోపీ పెట్టి వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో తప్పు చేయనప్పుడు సీఎం కేసీఆర్ ఎందుకు ప్రమాణం చేయట్లేదు. సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? 37 మంది ఎమ్మెల్యేలను సంతో పశువుల మాదిరిగా కొన్న కేసీఆర్ ఎమ్మెల్యేల భేరసారాల గురించి మాట్లాడటం సిగ్గు చేటు. వరి వేస్తే ఉరి అన్నది కేసీఆర్. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మీటర్ల పేరు చెప్పి విద్యుత్ చార్జీలు పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. డిస్కమ్‌లు నష్టాల్లో ఉండటానికి కారణం సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.













