జాతీయ అధ్యక్షుడు లేకుండానే.. రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా?: బండి సంజయ్
ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్కు ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడే లేడు. జాతీయ అధ్యక్షుడు లేకుండానే రాష్ట్ర అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారో నాకు అర్థం కాలేదు అన్నారు. సొంత రాష్ట్రంలోనే పార్టీ అధ్యక్షుడిని ప్రకటించలేదు. కానీ పక్క రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటో ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్ర ఓటర్లను నమ్మించి ఓట్లు వేయించుకోవడం సీఎం కేసీఆర్‌కు తెలిసిన విద్య అని విమర్శించారు. ఓట్లు అయిపోయాక నీళ్ల వాటా పేరుతో ఏపీ, తెలంగాణ అని మళ్లీ రెచ్చగొడతారని విమర్శించారు. గతంలో ఏపీ వాళ్లను కేసీఆర్ అవమానించలేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారా? విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో నిజాం చక్కెర పరిశ్రమ ఎందుకు పునరుద్ధరించటం లేదు. రాష్ట్రంలో విద్యుత్‌చార్జీలు పెంచింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏపీ సీఎంతో కుమ్మక్కై కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ వెళ్లట్లేదు. పోలవరం ప్రాజెక్టుపై మీ వైఖరి ఏమిటి? పోలవరం ఎత్తు పెంచాలో, తగ్గించాలో కేసీఆర్ చెప్పాలి. తెలంగాణ ఏర్పడక ముందు 18 లక్షల వ్యవసాయ బోర్లు ఉంటే, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23 లక్షల బోర్లు ఉన్నాయి. పాఠశాల విద్యలో తెలంగాణ 21వ స్థానంలో ఉంది. నిరుద్యోగంలో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. యువతను బీజేపీకి దూరం చేసేందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నారు అని ఆరోపించారు.













