Bandi Sanjay: త్వరలోనే ఆ ఇద్దరు మంత్రులు జైలుకే :బండి సంజయ్
రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో జైలుకెళ్తారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్య చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడుతూ చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని ఇద్దరు మంత్రులు (Ministers) వేల కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. వారి అవినీతిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) కూడా చర్చించుకుంటున్నారు. మేం కూడా ఇంటెలిజెన్సు రిపోర్టులు తెప్పించుకుంటున్నాం. వారి అవినీతి బాగోతం త్వరలోనే బయటపెడతాం అని ప్రకటించారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై (KCR) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) వాడిన భాష సరికాదని, రేవంత్ వాడిన భాష ఆయనకే నష్టమని అన్నారు. సీఎం హోదాలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని పేర్కొంటూ, గతంలో కేసీఆర్ ఇలా మాట్లాడినప్పుడు కూడా తాము ఖండించామని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణాకు పెద్ద శని అని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగితే కేవలం రూ. 9వేల కోట్ల అక్రమాలపైనే విచారణను ఎందుకు పరిమితం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉంది. ఈ వ్యవహారంలో, నక్సలైట్ల జాబితాలో మా పేర్లు చేర్చిన మూర్ఖుడు కేసీఆర్, 6వేల మందికిపైగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన నీచపు చరిత్ర ఆయనది అని దుయ్యబట్టారు.






