“తిరగబడదాం.. తరిమికొడదాం..” ఇదే కాంగ్రెస్ నినాదం..!!
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా కూడా అధికారాన్ని దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే ప్రత్యేక రాష్ట్రం సాకారమైందని అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ఇప్పటికే రెండు సార్లు ఆ పార్టీకి మాత్రం అధికారాన్ని కట్టబెట్టలేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం అనేక వ్యూహాలు రచిస్తోంది. ఈసారి తిరగబడదాం.. తరిమికొడదాం.. అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని.. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా కోర్టులు నిర్వహించాలని టీపీసీసీ తీర్మానించింది. అంతేకాక.. ప్రచారంలో ప్రజలను భాగస్వాములను చేసేలే మిస్డ్ కాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను అంశాలవారీగా చేపట్టి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నేతలు సూచించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.
మరోవైపు ప్రియాంక గాంధీ, డీకే శివకుమార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తలుగా వ్యవహరించనున్నారని సమాచారం. వాళ్లిద్దరి నేతృత్వంలో పార్టీ ముందుకు నడవనుంది. తెలంగాణలో నాయకుల మధ్య సమన్వయలోపం పెద్ద సమస్యగా మారింది. దీన్ని చక్కదిద్దడం అధిష్టానానికి పెద్ద సవాల్. అయితే దీనికి చెక్ పెట్టాలంటే ప్రియాంక్ గాంధీ లాంటి గాంధీ ఫ్యామిలీ వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుందని హైకమాండ్ భావిస్తోంది. అందుకే ఆమెను నేరుగా రంగంలోకి దించింది. నాయకులందరూ సమన్వయంతో పనిచేసి పార్టీని ముందు గెలిపించాలని.. ఆ తర్వాత పదవుల గురించి ఆలోచిద్దామని ఇప్పటికే ప్రియాంక గాంధీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలోనూ తీవ్ర ప్రభావం చూపించాయి. అప్పటివరకూ మూడో ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లోకి దూసుకొచ్చింది. బీఆర్ఎస్ – బీజేపీ మధ్యే పోటీ ఉంటుందనుకున్న వాళ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ గట్టి ఫైట్ ఇవ్వబోతోందని అంచనా వేస్తున్నారు. గట్టిగా కృషి చేస్తే అధికారాన్ని కూడా చేజిక్కించుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ఓడిపోయే నియోజకవర్గాలను పక్కన పెట్టి గెలిచే నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టాలనుకుంటోంది.






