కేసీఆర్ అటూఇటూ కాకుండా పోయారా..? ఇప్పుడు పయనమెటు..?
బీఆర్ఎస్ అధినేత దేశ్ కీ నేత అనిపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ రాజకీయాలను శాసించాలని ఆశిస్తున్నారు. అందుకోసమే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా తమ పోరాటం సాగుతుందని, ఈసారి ఎన్నికల్లో మోదీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తుందని పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే ప్రకటించారు. దీంతో ఆయన కాంగ్రెస్ కూటమిలో చేరొచ్చు అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన పలు కార్యక్రమాలకు కూడా హాజరయ్యారు. దీంతో ఆయన యూపీఏలో భాగస్వామ్యం కావడం ఖాయమనుకున్నారు. అయితే ఇప్పడు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కేసీఆర్ ను పట్టించుకోలేదు. దీంతో ఆయన ఒంటరిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.
తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్ కు గుర్తింపు ఉంది. ఆ పార్టీ జెండాపైనే ఆయన రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీ మంచి దూకుడు మీదుండడం… కేసీఆర్ పై విరుచుకు పడుతుండడంతో ఆ పార్టీని టార్గెట్ చేశారాయన. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు సహకరించట్లేదన్నారు. అంతేకాక.. మోదీ నేతృత్వంలో దేశానికి అధోగతి పట్టిందన్నారు. ఇలా బీజేపీ – బీఆర్ఎస్ మధ్య వార్ ఉధృతమైంది. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాం వెలుగులోకి రావడం.. అందులో కవిత పాత్ర ఉందని బీజేపీ చెప్పడంతో కేసీఆర్ కు మరింత కోపం వచ్చింది. అప్పుడే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణలో బయటికొచ్చింది. దీంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం వరకూ వెళ్లాయి. దీంతో రెండు పార్టీల మధ్య వార్ ఓ రేంజ్ కు వెళ్లింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ కు కాస్త దగ్గరయ్యే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఢిల్లీ వేదికగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిన పలు పోరాటాల్లో బీఆర్ఎస్ కూడా పాల్గొనింది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమిలో కేసీఆర్ చేరడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే తమకు అలాంటి ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీకి ఫుల్ జోష్ వచ్చింది. గట్టిగా ట్రై చేస్తే తెలంగాణలో కూడా కేసీఆర్ ను ఓడించవచ్చనుకుంది. దీంతో స్పీడ్ పెంచింది. ఇప్పుడు తెలంగాణలో ఫైట్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. మరోవైపు కేసీఆర్ ను బీజేపీ ఏజెంట్ గా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి బీఆర్ఎస్ బీటీం అని ప్రచారం చేస్తోంది.
ఇప్పుడు బెంగళూరులో యూపీఏ కూటమి భేటీ అయింది. రేపు ఢిల్లీలో ఎన్డీఏ పార్టీల సమావేశం జరగబోతోంది. ఈ రెండు కూటములు కేసీఆర్ ను దూరం పెట్టాయి. బీజేపీని ఓడించేందుకే బీఆర్ఎస్ పెట్టానని చెప్పడంతో కాంగ్రెస్ కూటమిలో చేరడం ఖాయమనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కూటమి నుంచి కూడా ఆహ్వానం రాకపోవడంతో కేసీఆర్ రెండింటికీ చెడినట్లయింది. ఢిల్లీలో అధికారంలోకి రావాలంటే ఆ రెండు పార్టీలో ఒకదానితో స్నేహం చేయడం తప్పనిసరి. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ కేసీఆర్ ను నమ్మట్లేదు. మరి ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారనేది అంతు చిక్కడం లేదు. అయితే లోక్ సభ ఎన్నికల తర్వాత అవసరం మేరకు బీజేపీతో కేసీఆర్ కలిసే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..!













