కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! 170 ఫోన్లు ధ్వంసం చేశారట..!!
అనుకున్నట్టుగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయ రంగు పులుముకుంది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముందు నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నట్టుగానే తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు రిపోర్టులో వెలుగుచూసింది. ఢిల్లీ మద్యం కేసులో కీలకంగా భావిస్తున్న 36 మంది పేర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పొందుపరిచింది. లిక్కర్ స్కామ్ తో అమిత్ అరోరాకు సంబంధం ఉందనే కారణంలో ఆయన్ను మంగళవారం ఈడీ అదుపులోకి తీసుకుంది. బుధవారం కోర్టులో హాజరు పరిచింది. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇందులోనే తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరును కూడా ప్రస్తావించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను కూడా ఈ జాబితాలో చేర్చింది.
అమిత్ అరోరా రిపోర్టులో ఈడీ అనేక సంచలన విషయాలను పేర్కొంది. లిక్కర్ స్కాములో పాత్రధారులుగా భావిస్తున్న 36 మంది.. గత ఏడాదికాలంలో 170కి పైగా ఫోన్లను వాడి ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇందులో ఐదుగురు తెలుగువారున్నట్టు తెలిపింది. వీళ్లు 33 ఫోన్లను వాడి ఆచూకీ లేకుండా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. కవిత 10 ఫోన్లు, శరత్ చంద్రారెడ్డి 9, గోరంట్ల బుచ్చిబాబు 6, బోయినపల్లి అభిషేక్ 5, సృజన్ రెడ్డి 3 ఫోన్లను వాడి వదిలేసినట్లు రిపోర్టులో తెలిపింది. వాళ్లు వాడిన ఫోన్లను, ఫోన్ నెంబర్లను, IMEI నెంబర్లను రిపోర్టులో కోర్టుకు సమర్పించింది. అంతేకాక.. ఏ ఏ తేదీల్లో ఆ ఫోన్లను ధ్వంసం చేశారో కూడా నివేదికలో పొందు పరిచింది. కేసులో ఆధారాలు లేకుండా తప్పించుకునేందుకే ఈ ఫోన్లను ధ్వంసం చేశారని.. ఆ ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది ఈడీ.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో లోతైన విచారణ చేస్తున్న ఈడీకి విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ధ్వంసం చేసిన 170 ఫోన్లలో 17 ఫోన్లను ఈడీ రికవరీ చేసినట్లు తెలుస్తోంది. వీటిలో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరితో ఏం చాట్ చేశారు.. లాంటి అంశాలన్నింటినీ డిలీట్ చేసినట్లు ఈడీ గుర్తించింది. కొన్ని ఫోన్లను ఫార్మాట్ చేసినట్లు తేల్చింది. అయితే మిగిలిన ఫోన్ల ఆచూకీ కూడా తలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ఫోన్లు చిక్కితే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తోంది. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులు, మంత్రులు, మద్యం వ్యాపారులు, ప్రభుత్వ అధికారులు, కీలకపాత్ర పోషించిన రాజకీయ నాయకుల ఫోన్లే టార్గెట్ గా ఈడీ విచారణ సాగిస్తోంది. అమిత్ అరోరా 11 ఫోన్లను వాడి వాటిని ధ్వంసం చేసినట్లు తేలడం.. వాటిని లోతుగా అధ్యయనం చేయడంతో ఈడీకి మరిన్ని విషయాలు తెలిసాయి. అంతేకాదు.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా 14 ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ గుర్తించింది.
లిక్కర్ వ్యాపారంలో పలు తెలుగు ప్రముఖులు ఉన్నారు. దేశంలో ఎక్కడ లిక్కర్ సప్లై చేయాలన్నా అక్కడ కచ్చితంగా తెలుగువాళ్లు ఉంటారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా అక్కడ లిక్కర్ సప్లై చేసే బాధ్యతను పలు తెలుగు కంపెనీలు చేజిక్కించుకున్నాయి. సౌత్ గ్రూపుకు చెందిన శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన కంపెనీలకు ఈ డీల్స్ దక్కాయి. ఇందుకుగానూ ఆప్ నేతలకు సుమారు వంద కోట్ల రూపాయలు ముట్టజెప్పినట్టు ఈడీ రిపోర్టులో వెల్లడించింది. ఇన్నాళ్లూ లిక్కర్ స్కాములో కవిత ఉన్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేరు ప్రస్తావించడంతో టీఆర్ఎస్ వర్గాల్లో కలవరం మొదలైంది. కక్షపూరితంగానే కేంద్రం ఈడీ, సీబీఐ లతో ఇలాంటి పనులు చేయిస్తోందని ఆరోపిస్తోంది టీఆర్ఎస్. మరి చూడాలి ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో..!













