లిక్కర్ స్కామ్లో ఉచ్చు బిగిస్తున్న ఈడీ..! మునుగోడు పోలింగ్ నాటికి కీలక వ్యక్తి అరెస్ట్..?
తీగ లాగితే డొంక కదిలింది అన్నట్టు తయారైంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం. ఎక్కడో ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగినట్లు సీబీఐకి ఫిర్యాదు అందడంతో మొదలైన విచారణ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించే స్థాయికి వెళ్లింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ విచారణ అంతా హైదరాబాద్ చుట్టూనే తిరుగుతోంది. ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన పలువురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఒక్కొక్కరినీ అరెస్ట్ చేస్తూ వస్తోంది. అయితే ఈ అరెస్టుల వ్యవహారం మునుగోడు పోలింగ్ నాటికి తీవ్రం కానుందనే ప్రచారం ఇప్పడు ఉత్కంఠ కలిగిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని బీజేపీ నేతలు మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్లే ఇక్కడే ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈడీ. ఇప్పటికే పలు దఫాలుగా ఇక్కడ పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం అరెస్టులు మొదలు పెట్టింది. గతంలో శ్రీనివాసరావు అనే రియల్టర్ ను అరెస్ట్ చేసిన ఈడీ.. ఇప్పుడు బోయిన్ పల్లి అభిషేక్ రావు అనే వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకుంది. వీళ్లద్దరినీ ఢిల్లీ తరలించింది ఈడీ.
లిక్కర్ స్కామ్ సోదాల్లో కీలక ఆధారాలను ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో దసరా తర్వాత సోదాలు ముగిసిన వెంటనే టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన అభిషేక్ రావును అరెస్ట్ చేసింది. రాబిన్ డిస్టిలరీస్ లో ఈయన డైరెక్టర్. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన అనూస్ బ్యూటీ పార్లర్స్ ఈయనకు చెందినవే. అనూస్ ఆఫీసు అడ్రస్ నే రాబిన్ డిస్టిలరీస్ కు వాడినట్లు ఈడీ గుర్తించింది. అంతేకాక.. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి అభిషేక్ రావు వ్యాపారాలు చేస్తున్నట్టు ఈడీ విచారణలో తేలింది. దీంతో అభిషేక్ రావును అదుపులోకి తీసుకుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విజయ్ నాయర్, సమీర్ మహేంద్రును ఈడీ ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. ఇండో స్పిరిట్స్ డైరెక్టర్ గా ఉన్న సమీర్ మహేంద్రు.. తన బ్యాంక్ ఖాతా నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సన్నిహితుడైన దినేశ్ అరోరా ఖాతాకు కోటి రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ గుర్తించింది. దినేశ్ అరోరా నుంచి ఆ డబ్బు మనీశ్ సిసోడియాకు చేరిందనేది ఈడీ చెప్తున్న మాట. ఇలాగే విజయ్ నాయర్, రామచంద్ర పిళ్లై.. తదితరుల నుంచి నగదు బదిలీ అయిందని ఈడీ విచారణలో తేలింది.
ఇప్పుడు అభిషేక్ రావును ఈడీ అదుపులోకి తీసుకోవడం హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తోంది. రామచంద్ర పిళ్లై ఇచ్చిన సమచారం ఆధారంగానే శ్రీనివాసరావు, అభిషేక్ రావులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీళ్లు టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ లకు సన్నిహితులు. అభిషేక్ రావు 9 సంస్థల్లో డైరెక్టర్ గా ఉన్నారు. ఇతని ఖాతా నుంచి పెద్ద ఎత్తున నగదు బదిలీ అయినట్లు తెలుస్తోంది. అభిషేక్ రావు విచారణ తర్వాత.. ఆయనతో సన్నిహితంగా ఉన్న ఇద్దరు కీలక వ్యక్తులను ఈడీ విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. మునుగోడు పోలింగ్ సమయానికి టీఆర్ఎస్ నేతలను విచారించడం లేదా అరెస్ట్ చేయడం ద్వారా ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.













