‘రెడ్ల’పై ఫోకస్ పెట్టిన బీజేపీ..! టీకాంగ్రెస్ పని అయిపోయినట్లేనా..?
తెలంగాణలో బీజేపీ దూకుడు మామూలుగా లేదు. అధికార టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకెళ్తోంది. అధిష్టానం అండదండలు పుష్కలంగా ఉండడంతో రాష్ట్రస్థాయి నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటున్నారు. అదే సమయంలో పార్టీ పటిష్టతపైన కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు. బలమైన నేతలను చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఇందుకోసం తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు అర్థమవుతోంది. బీజేపీ గూటికి మరో రెడ్డి చేరికకు రంగం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ తో పోల్చితే తెలంగాణలో కుల రాజకీయం తక్కువే. అయితే ఇప్పుడిప్పుడు తెలంగాణలో కూడా కుల రాజకీయాల ప్రస్తావన పెరిగిపోయింది. పార్టీలు కూడా కులాలవారీగా నేతలను చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి రెడ్డి పార్టీగా పేరుండేది. వై.ఎస్.రాజశేఖర రెడ్డి, పి.జనార్ధన్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి.. ఇలా పలువురు రెడ్డి సామాజిక వర్గ నేతలు ఆ పార్టీని ఏలారు. ఇప్పుడు కూడా ఆ పార్టీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువే కానీ గతంలో ఉన్నంత కాదు. ఉన్న కొద్దిమంది రెడ్డి నేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతోకాలంగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీలో ముసలం మొదలైందని చెప్పొచ్చు. పార్టీలో ఎంతోకాలంగా పాతుకుపోయిన నేతలెంతోమంది రేవంత్ రెడ్డితో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీని నడిపించే సారథి ఎవరూ లేకపోవడంతో రేవంత్ రెడ్డినే నమ్ముకుంది పార్టీ అధిష్టానం. రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని సహించలేని కొందరు సీనియర్ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఇప్పుడు అదే కోవలో పయనిస్తున్నారు మర్రి శశిధర్ రెడ్డి. ఢిల్లీలో అమిత్ షాను కలిసిన మర్రి శశిధర్ రెడ్డి.. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువే. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్న రెడ్లను దగ్గరకు చేర్చుకోవడం ద్వారా బలమైన శక్తిగా ఎదగాలనుకుంటోంది బీజేపీ. అందులో భాగంగానే వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న పలువురు రెడ్లపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే టీఆర్ఎస్ లో ఉన్న మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి డి.కె.అరుణలను చేర్చుకుంది. ఆ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని లాగేసుకుంది. ఇప్పుడు మర్రి శశిధర్ రెడ్డికి గాలం వేసింది. మున్ముందు మరింతమందిని చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతలపై బీజేపీ స్కెచ్ వేసినట్లు సమాచారం.













