ఆ ఇద్దరు ప్రముఖులతో సీఎం రేవంత్ భేటీ

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రజల్లో నూతనోత్తేజం నింపుతూ జయజయహే తెలంగాణ అనే గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వ గీతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే, గతంలోని గీతానికి కొత్త సొబగులు తొడుగుతూ ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఎంఎ కీరవాణి, ప్రముఖ కవి, గేయ రచయిత అందెశ్రీ బృందం స్వల్ప మార్పులతో కూర్చు చేసింది. నిమిషంన్నర నిడివితో గీతాన్ని కుదించి కొత్తదనం తెచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ ఇద్దరు ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్రీయ్ర గీతం అయిన జయ జయహే తెలంగాణ పాటను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు గానూ సీఎం రేవంత్ వీరితో భేటీ అయ్యారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా డాక్టర్ అందెశ్రీకి పేరుంది. ఇప్పటికే ఉన్న జయజయహే తెలంగాణ జవనీ జయకేతనం అనే పాటను అందెశ్రీ రచించి రికార్డు సృష్టించారు. ఈ పాట చాలా పాపులర్ అయింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ విద్యా సంస్థల్లో ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతీ గీతంగా, ప్రార్థనా గీతంగా కూడా ఈ పాటను పాడుకుంటారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక ఈ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.