తెలంగాణలో అధికారంలోకి వస్తాం : అమిత్ షా
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రోజుల నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చండూరు మండలం తెరట్పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బిజేపీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటికీ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును అడిగి తెలుసుకున్నారు. మవోయిస్టుల చేతిలో హతమైన మైసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బూత్‌స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతోందన్నారు. పార్టీని మరింత పటిష్టపరిచేందుకే తాను రాష్ట్రాల పర్యటన ప్రారంభించినట్లు చెప్పారు. కేంద్రం మంజూరు చేసిన పథకాలు తెరటుపల్లిలో అమలు కావడం లేదని తన దృష్టికి వచ్చినట్లు షా తెలిపారు. దీన్ దయాళ్ సిద్ధాంతాలు మోడీ ఆశయాలు ప్రజలకు చేరువయ్యేలా చెయ్యాలని సూచించారు. నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయ్యాలని పిలుపునిచ్చారు. దేశమంతా సాగుతున్న అభివృద్ధి తెలంగాణకు చేరాలన్నారు. ఆ దిశలో కార్యకర్తలు పని చేయాలన్నారు.













